డెలియన్ పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ భేటీ
నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించిన సీఎం
చైనా సెప్టెంబర్ 8(జనంసాక్షి) :
చైనాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా భారత రాయబారి అశోక్ కాంతాతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ డేలియన్ నగరంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిన్న ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చైనాకు బయల్దేరిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం చైనా పర్యటనలో భాగంగా మంగళవారం పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమైంది. తెలంగాణలోని పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలపై కేసీఆర్ బృందంతో దలియన్ ప్రావిన్స్ కు చెందిన వ్యాపారవేత్తలు ఈరోజు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పారిశ్రామికరంగంలో అనుమతుల కోసం తెచ్చిన టీఎస్ ఐపాస్ ను చైనా పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం చైనాకు చేరుకుంది. ఉదయం పది గంటలకు సీఎంతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరగా.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30కు చైనాలోని డేలియన్ నగరానికి చేరుకున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు అక్కడ జరిగేవరల్డ్ ఎకనమిక్ ఫోరంసదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. రాష్ట్రంలోని నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనేది ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.