డేరాబాబాను కొలిచిన ప్రజల్లో ఆగ్రహం

ఫోటోలను డ్రనేజీల్లోకి విసిరివేత

కొన్నిచోట్ల తగులబెట్టిన భక్తులు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ఇంతకాలం ప్రత్యక్ష దైవంగా వెలుగుఒందిన గుర్మీత్‌ బాబా పేరు చెబితేనే ఇప్పుడు ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి వెధవనా ఇంతకాలం తాము కొలచిందని ఈసడించు కుంటున్నారు.. ఆయన కాలు కదిలిస్తే ఆశీర్వాదం కోసం సాగిల పడేవారు.. ఒంగి ఒంగి దండాలు పెట్టేవారు.. ఆయన కంట్లో పడాలని తహతహలాడేవారు.. ఆయన దర్శనం మహాభాగ్యం అంటూ డేరా బాబా రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ కోసం తాపత్రయపడ్డవారంతా ఇప్పుడు పాశ్చయాత్తాపపడుతున్నారు. అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష పడటం.. ఆయన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అభిమానులు, భక్తుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వీడు బాబా కాదు.. భయంకరమైన వెధవ అని తిట్టిపోస్తున్నారు. ఇళ్లలో ఫొటోలను, పటాలను వీధుల్లో పడేస్తున్నారు. వీటిని చెత్తకుప్పలు, మురికి కాలువల్లోకి విసిరేస్తున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ లో గుర్మీత్‌ కు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. లక్షల మంది ఆయన్ను దేవుడిగా కొలుస్తున్నారు. నిజస్వరూపం తెలిసిన తర్వాత ఆయన చిత్రపటాలను వీధుల్లోని చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. డ్రైనేజీల్లో విసిరేస్తున్నారు. గుర్‌ సర్‌ ముడియా గ్రామంలో అయితే ఏ వీధి చూసిన డేరా బాబా ఫొటోలే కనిపిస్తున్నాయి. వీడి నైజం తెలిసిన తర్వాత కూడా ఎలా పూజిస్తాం.. అందుకే ఆ ఫోటోలను విసిరేస్తున్నాం.. ఇంట్లో నుంచి తీసేస్తున్నాం అని చెబుతున్నారు. డేరా అభిమానులు ఉండే ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో గుట్టల కొద్దీ గుర్మీత్‌ ఫొటోలు ఉంటున్నాయి. డ్రైజీలన్నీ జామ్‌ అయ్యి రోడ్లపైకి కంపు రావటంతో ఆరా తీసిన ముడియా గ్రామ అధికారులకు ఈ విషయం తెలిసింది. కొందరు అయితే తగులబెడుతున్నారు. ఇకపోతే గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సొంత జిల్లా శ్రీగంగానగర్‌లో గుర్మీత్‌కు మింగుడు పడని సంఘటన జరిగింది. అభిమానలు నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది. గుర్మీత్‌ను దైవంగా భావించే అభిమానులు ఆయనపై పీకలదాక కోపంతో ఉన్నారు. నమ్మిన వ్యక్తి మోసం చేశారనే కోపంతో ఆయన చిత్రపటాలను మురికి కాల్వలో పడేశారు. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాకు చెందిన ,చీఫ్‌ శానిటేషన్‌ ఇన్స్పెక్టర్‌ దేవేంద్ర రాథోడ్‌ సాధారణ తనిఖీలకు వెళ్లారు. రోజు వారి తనిఖీల్లో భాగంగా విూరా చౌక్‌, సుఖాడియా సర్కిల్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ వందలాది ఫోటోలు మురికి కాల్వల్లో విసిరేసినట్లు కనిపించాయి. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హనీప్రీత్‌ పై లుక్‌ ఔట్‌ నోటీసు

లైంగిక దాడి కేసుల్లో 20 ఏండ్ల జైలు శిక్షపడిన డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రాంరహీంసింగ్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అంతకుముందే కుట్ర చేశాడు. కుట్ర అమలుకు ఆయన అనుచరులు విఫలయత్నం చేసి, అరెస్టయ్యారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ కుట్ర సంగతి బయటపడింది. ఈ కుట్రలో డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ వారసురాలు, దత్త పుత్రిక హనీప్రీత్‌ ప్రధాన పాత్రదారి అని తెలుసుకున్న హర్యానా పోలీసులు.. హనీప్రీత్‌ పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేశారు. గుర్మీత్‌ ను తప్పించేందుకు యత్నించిన కేసులో హనీప్రీత్‌ నిందితురాలుగా ఉంది. హనీప్రీత్‌ తో పాటు గుర్మీత్‌ ముఖ్య అనుచరుల కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ఎయిర్‌ పోర్ట్స్‌ లో భద్రత ను కట్టుదిట్టం చేశారు. పట్టుబడిన ఏడుగురు డేరా గార్డుల్లో ఐదుగురు హర్యానా పోలీసు సిబ్బంది కావడం విశేషం.