డేరా అనుచరులు మరో ముగ్గురు అరెస్ట్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): డేరాబాబా గుర్మీత్‌ సింగ్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 25న పంచకుల కోర్టు డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హింసాకాండకు దిగారు. డేరాబాబాను పోలీసులు అరెస్టుచేయకుండా కాపాడేందుకు ఆయన ప్రయివేటు భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. డేరా అనుచరులు అల్లర్లపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. తాజాగా డేరా సచ్చా సౌదాకి చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా 20 ఏళ్ల జైలు శిక్ష పడిన గుర్మీత్‌ సింగ్‌ ప్రస్తుతం రోహ్‌తక్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. డేరాను అడ్డాగా చేసుకుని ఆయన చేసిన అకృత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు డేరా ప్రధాన కార్యాలయాన్ని జ్లలెడపడుతున్నారు.