డేరా ఆశ్రమంలో భారీగా సాదాలు

 

హార్‌డ్డిస్క్‌,నగదు స్వాధీనం

సాయుధ బలగాల పర్యవేక్షణ, కర్ఫ్యూ విధింపు

చండీఘడ్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): హర్యానాలోని సిర్సాలో డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు, అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల ర్ఫ్యూ విధించి భారీ భద్రత మధ్య సోదాలు కొనసాగిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా పోలీసుల సారథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాలు దాదాపు వారం రోజుల పాటు కొనసాగనున్నట్టు సమాచారం. అత్యాచారం కేసుల్లో దోషిగా తేలిన డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరాబాబాకి.. సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ గురించి రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. సోదాలు జరిపిన అధికారుల బృందానికి ఓ హార్డ్‌ డిస్క్‌ దొరికింది. పెద్ద ఎత్తున నగదు, ఆయుధాలతోపాటు హార్డ్‌ డిస్క్‌ ను స్వాధీనం చేసుకున్న అధికారులు దానిలో ఏముందనే విషయంపై దృష్టి సారించారు. డేరాలో రేపిస్టు గుర్మిత్‌ సాగించిన అరాచకాల బాగోతం హార్డ్‌ డిస్క్‌ లో ఉందా అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారు. 41 పారామిలటరీ కంపెనీల బలగాల సాయుధ పహరా మధ్య నాలుగు జిల్లాల పోలీసులు, అధికారులు సోదాలు సాగించారు. డేరా ప్రధాన ఆశ్రమమైన హరియాణాలోని సిర్సాలో గుర్మీత్‌ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక హరియాణా, పంజాబ్‌లలోని డేరా ఆశ్రమాల నుంచి ఇప్పటికే ఆయుధాలు లభ్యమయ్యాయి. దీంతో సిర్సాలోని ఆశ్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీలకు కొద్ది గంటల ముందే డేరా అనుకూల పత్రిక ఒకటి ఆశ్రమం గురించి షాకింగ్‌ నిజాలు వెల్లడించింది. సిర్సా ప్రాంగణంలో అస్థిపంజరాలు ఉన్నాయని డేరా పత్రిక ‘సచ్‌ కహూ’ పేర్కొంది.అయితే అంత్యక్రియలు బయట ఎక్కడో కాకుండా సిర్సా ప్రాంగణంలోనే చేయాలని గుర్మీత్‌ చెప్పేవారని ఆ పత్రిక తెలిపింది. నది కలుషితం కాకుండా ఉండేందుకు గుర్మీత్‌ ఇలా చెప్పేవారని పేర్కొంది. అలా అంత్యక్రియలు సిర్సా ప్రాంగణంలో

చేసిన తర్వాత ఆ ప్రదేశంలో మొక్కలు నాటేవారని పత్రికలో వెల్లడించారు. కాగా.. గుర్మీత్‌కు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపేసి ప్రాంగణంలోనే పూడ్చిపెట్టేవారని డేరా నుంచి బయటకు వచ్చేసిన కొందరు చెబుతుండటం గమనార్హం. మరోవైపు సిర్సా ప్రాంగణాన్ని నేడు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 400 మంది బాంబు స్క్వాడ్స్‌, కమాండోలు, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దాదాపు 700 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంగణంలో ఈఫిల్‌ టవర్‌, తాజ్‌మహర్‌, డిస్నీ లాండ్‌ నమూనాలు, రిసార్ట్‌లు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ మిస్టరీ డెన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ డెన్‌ను తెరిచే అవకాశముంది. డేరాను అడ్డాగా చేసుకుని గుర్మీత్‌ సింగ్‌ పాల్పడిన అనేక అకృత్యాలు ఇప్పటికే వెలుగు చూడగా.. తాజాగా అధికారులు జరుపుతున్న సోదాలతో మరిన్ని షాకింగ్‌ విషయాలు వెలుగుచూడడం ఖాయమని చెబుతున్నారు. డేరా క్యాంపస్‌ మొత్తం 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉపగ్రహ చిత్రాల సాయంతో అధికారులు క్యాంపస్‌ మొత్తం జ్లలెడపడుతున్నారు. డేరాలో సొంత కరెన్సీతో పాటు ఆర్థికంగా అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో… 100 మందికి పైగా బ్యాంకు అధికారులు కూడా రంగంలోకి దిగారు. బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ చెందిన డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయంలో… భద్రతా దళాలు, పోలీసు బృందాలు సోదాలకు ఉపక్రమించాయి. డేరా ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు మొత్తం 12 ప్రధాన ద్వారాలు ఉన్నట్టు గుర్తించారు. షా సత్నమ్‌ ఆస్పత్రి ఈ ప్రధాన ద్వారాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం సోదాలు షా సత్నమ్‌ ఆస్పత్రి వరకు చేరాయి.

ప్రముఖ కాశిష్‌ రెస్టారెంట్‌ లోపల అధికారులు సోదాలు ప్రారంభించారు. సెర్చ్‌ ఆపరేషన్ల కోసం డేరా క్యాంపస్‌ మొత్తాన్ని పలు జోన్లు, సెక్టార్ల కింద విభజించారు. ప్రతి సెక్టార్‌లోనూ ఓ మేజిస్టేట్ర్‌ పర్యవేక్షణలో సోదాలు జరుగుతున్నాయి. బాంబ్‌ స్క్వాడ్లు, పోలీసు జాగిలాలు కూడా డేరా లోపలికి ప్రవేశించాయి.