డోప్‌ టెస్ట్‌లో పట్టుబడిన రెజ్లర్లు

శాంపిల్‌లో దోషిగా తేలితే చర్యలు

రెండేళ్ల నిషేధం విధించే అవకాశం
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11:  భారత క్రీడారంగాన్ని డోపింగ్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది పలువురు అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో పట్టుబడి నిషేధానికి గురైతే… తాజాగా రెజ్లర్లు కూడా ఆ జాబితాలో చేరారు. నవంబర్‌ 9 నుండి 11 వరకూ ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జాతీయ పురుషుల రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన డోప్‌ టెస్టుల్లో ఐదుగురు రెజ్లర్లు దొరికిపోయారు. బల్‌రాజ్‌సింగ్‌ (55 కేజీలు), సుక్విందర్‌ (55 కేజీలు), జితేందర్‌ (74 కేజీలు), మనీష్‌ (60 కేజీలు), మనోజ్‌ (55 కేజీలు) దొరికిన వారిలో ఉన్నారు. వీరి శాంపిల్స్‌లో నిషిధ్ద ఉతే్పరకాలు ఉన్నాయని, టెస్టుల్లో పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్టు నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) ప్రకటించింది. దీంతో సుశీల్‌కుమార్‌, యోగేశ్వర్‌ దత్‌ ఒలింపిక్స్‌ విజయాల తో ఆనందంతో ఉన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య షాక్‌కు గురైంది. తమకు ఇది చాలా చేదు వార్త అని, ఇలాంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్టు భారత రెజ్లింగ్‌ సమాఖ్య సెక్రటరీ రాజ్‌సింగ్‌ చెప్పారు. బయట మార్కెట్‌లో నిషేధిత ఉత్పేర్రకాల పట్ల ఆకర్షితులవడం ఆటకే చెడ్డపేరు తెస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే గాయాల బారిన పడినప్పుడు డాక్టర్‌ను ఒకటికి రెండుసార్లు సంప్రదించిన తర్వాతే మెడిసన్స్‌ వాడాలని సూచించారు. కొన్ని మందులలో నిషేధిత ఉత్పేర్రకాల అవశేషాలు ఉన్నా కూడా ఇబ్బందేనని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఐదుగురి రెజ్లర్లపై ఫెడరేషన్‌కు నాడా ప్రత్యేకంగా లేఖ రాసింది. అథ్లెట్ల బి శాంపిల్స్‌ కూడా పరిశీలించి , దానిలో కూడా పాజిటివ్‌ అని తేలితే వారిపై రెండేళ్ళ నిషేధం విధించే అవకాశముంది. పట్టుబడిన ఐదుగురు రెజ్లర్లలో నలుగురు పోడియంలో విజేతగా నిలిచారు. ఒకవేళ బి శాంపిల్‌లో కూడా దోషిగా తేలితే వారు గెలిచిన పతకాలు వెనక్కి తీసుకుంటారు.