డ్రైవర్ ను హత్య చేసిన ఐఎఎస్ కొడుకు!

ias-son

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ టెర్రస్‌పై ఓవ్యక్తి హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హత్యకు కారకుడు ఓ ఐఏఎస్‌ కుమారుడని పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, స్థానికుల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి ఓయువకుడు యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్‌ రెసిడెన్సీ టెర్రస్‌పై నుంచి ఓ బస్తాను దించుతూ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అపార్టుమెంట్‌ వాసులు అతన్ని నిలదీయగా బస్తాను అక్కడే వదిలేసి పారిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా ఘటనాస్థలికి చేరుకుని బస్తాను విప్పిచూడగా మృతదేహం ఉంది. వెంటనే అపార్టుమెంట్‌లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. శుక్రవారం రాత్రి ఇద్దరు అపరిచితులు అపార్టుమెంట్‌కు వచ్చి అదేరోజు అర్ధరాత్రి ఒక్కరు మాత్రమే వెళ్లినట్లు గుర్తించారు. ఆ చిత్రాలను తీసుకుని ఆదివారం యూసుఫ్‌గూడలో దర్యాప్తు చేశారు. కెమెరాల్లో నమోదైన ఇద్దరిలో ఒకరు జవహర్‌నగర్‌లో ఉంటున్న నాగరాజు(40)గా గుర్తించారు. అతని వెంట ఉన్న వ్యక్తి ఐఏఎస్‌ అధికారి కుమారుడని తేలింది. శుక్రవారం రాత్రి ఇద్దరు టెర్రస్‌పైకి వెళ్లి మద్యం తాగి.. తర్వాత నాగరాజును ఐఏఎస్‌ కుమారుడు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారి వద్ద నాగరాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు అతని భార్య పోలీసులకు తెలిపారు. అపార్టుమెంట్‌ వాచ్‌మేన్‌ సెలవులో ఉండటంతో వారిద్దరు టెర్రస్‌పైకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగరాజు హత్యకు గల కారణాలు, ఐఏఎస్‌ అధికారి ఎవరు, నిందితుడి వివరాలు తెలియరాలేదు.