ఢాకాలో బంగ్లా సంచలనం
20 పరుగుల తేడాతో ఆస్టేల్రియాపై ఘన విజయం
ఢాకా,ఆగస్టు30: తాము బేబీలం కాదు పులులమని బంగ్లాదేశ్ మరోసారి రుజువు చేసుకుంది. ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. టెస్టుల్లో మరో పెద్ద జట్టుకు షాకిచ్చింది. ఆస్టేల్రియాను 20 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ¬రా¬రీగా సాగిన మ్యాచ్ లో బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ అద్భుత బౌలింగ్ కు ఆసీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఓపెనర్ వార్నర్ పోరాడి సెంచరీ చేసినా..మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో 265 పరుగుల లక్ష్యఛేదనలో 244 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ ఐదు వికెట్లు తీయగా.. తైజుల్ 3, మిరాజ్ 2 వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆస్టేల్రియా దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ వార్నర్ అద్భుత బ్యాటింగ్ తో అలరించాడు, టెస్ట్ కెరీర్ లో 19వ సెంచరీ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న వార్నర్ ను షకీబుల్ హాసన్ ఔట్ చేశాడు, కాసేపటికే కెప్టెన్ స్మిత్ ను ఔట్ చేసి బంగ్లాకు డబుల్ ధమాకా అందించాడు. 15 పరుగులు చేసిన హండ్స్ కంబ్ ను తైజుల్ పెవిలియన్ కు చేర్చగా, ప్రమాదకర ఆటగాడు మ్యాక్సివెల్ ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ కు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన అగర్ 2 పరుగులే చేసి ఔటయ్యాడు. మరోవైపు కీపర్ వేడ్ కూడా విఫలం అయ్యాడు. చివర్లో కమ్మిన్స్, లియాన్ లు కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హాజిల్ హుడ్ ను తైజుల్ ఎల్బీ గా ఔట్ చేయడంతో షేర్ బంగ్లా స్టేడియం అంతా సంబరాల్లో మునిగి పోయింది. కమ్మిన్స్ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టెస్టుల్లో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటిదాకా 10 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. గతంలో ఇంగ్లండ్, శ్రీలంక లాంటి పెద్ద జట్లపై బంగ్లా నెగ్గింది.