ఢిల్లీపై కేంద్రం పెత్తనం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటాన్ని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
తప్పుబట్టారు. ఆయన శుక్రవారం విూడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేందుకు చూస్తోందంటూ విరుచుకుపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ ప్రజలకు కేంద్రం తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. అవినీతి అధికారులకు కొమ్ము కా’సేలా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం విచారకరమన్నారు.
ఢిల్లీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ప్రధాని మోదీ న్యూఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కానుక ఈ నోటిఫికేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యాంగ నిపుణులతో చర్చించి, వారి సలహాలు తీసుకుంటామన్నారు. అయినా తమది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వమనీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మద్దతు, సహాయ సహకారాలు తమకు పూర్తిగా ఉన్నాయన్న కేజ్రీవాల్ ధీమాను వ్యక్తం చేశారు.