ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ బిజీ

ఢిల్లీ,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి):ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవడేకర్‌, అరుణ్‌ జైట్లీ, రాజ్‌ నాథ్‌ సింగ్‌ లను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.హైదరాబాద్‌ లో రోడ్ల విస్తరణకు బేగంపేటలోని రసూల్‌ పురాలో ఉన్న రెండున్నర ఎకరాల కేంద్ర ¬ంశాఖ స్థలాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని రాజ్‌ నాథ్‌ సింగ్‌ ని కోరారు. ఈ స్థలం కేటాయింపుపై గతంలో రాజ్‌ నాథ్‌ సింగ్‌ సానుకూలత వ్యక్తం చేసినా, అధికారులు ఫైలుని తిరస్కరించారు. దీంతో, ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ మరోసారి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ని కోరారు. ఇందుకు మరోసారి ప్రతిపాదనలు ఇవ్వాలని రాజ్‌ నాథ్‌ సింగ్‌ సూచించారు.కరీంనగర్‌ లో కొత్తగా ట్రిపుల్‌ ఐటీని కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇందుకు కావాల్సిన నిధుల్లో కేంద్రం 50 శాతం కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, ప్రైవేట్‌ సంస్థల నుంచి 15 శాతం సమకూర్చుకునేలా ప్రయత్నాలు చేస్తామని కేంద్ర మంత్రికి వివరించారు.దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రతిపాదనలు రెండు, మూడు ఉన్నాయని కేంద్రమంత్రి జవడేకర్‌ చెప్పారు. అన్ని అంశాలను క్యాబినేట్‌ ముందుకు తీసుకెళ్లి తెలంగాణకు కొత్త ట్రిపుల్‌ ఐటీ మంజూరు అయ్యేలా చొరవ చూపిస్తామని హావిూ ఇచ్చారు.గతంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్ర మంత్రి జవడేకర్‌ కి రెండు అంశాలను వివరించారు. రాష్ట్రానికి కొత్తగా ఐఐఎమ్‌ మంజూరు చేయాలని, రీజినల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కేటాయించాలని కోరారు. ఈ రెండు అంశాలను కేటీఆర్‌ మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఐఐఎమ్‌ ఏర్పాటుకు కావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ సూచించారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో ఎఫ్‌ఆర్బీఎం పరిమితి పెంపుపై మంత్రి కేటీఆర్‌ చర్చించారు. 14వ ఆర్థిక సంఘం సైతం తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని సూచించిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రధాని మోడి, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రానికి కొత్తగా ఐఐఎం ను కేటాయించాలని, అందుకు ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పార్లమెంట్‌ వేదికగా తెలంగాణకు ఎయిమ్స్‌ ను ప్రకటించినా, ఎయిమ్స్‌ ఏర్పాటుకు కావాల్సిన నిధులను కేటాయించని విషయాన్ని కేంద్ర మంత్రి జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా ఎయిమ్స్‌ కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ఢిల్లీ పర్యటనలో లండన్‌ డిప్యూటీ మేయర్‌ రాజేశ్‌ అగర్వాల్‌ తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల స్థాపనపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం పరిశ్రమల స్థాపనలో తెలంగాణ ప్రభుత్వ తీసుకువచ్చిన టీఎస్‌ ఐపాస్‌, టీ హబ్‌ గురించి లండన్‌ డిప్యూటీ మేయర్‌ కు వివరించారు. డిసెంబర్‌ లో భారత్‌ రానున్న లండన్‌ మేయర్‌ ను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలని డిప్యూటీ మేయర్‌ ను మంత్రి కేటీఆర్‌ కోరారు.మంత్రి కేటీఆర్‌ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎంపీ వినోద్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌ తదితరులు ఉన్నారు.