ఢిల్లీలో.. మంచు కప్పి చంపేస్తున్న చలి

 

రణ నినాదంతో గర్జిస్తున్న రైతుపులి

– ‘మన్‌ కీ బాత్‌’ లక్ష్యంగా నిరసనలకు పిలుపు

– నేటి నుంచి రిలేనిరాహార దీక్షలు ప్రారంభం

– టోల్‌బూత్‌ల వద్ద రుసుములు నిలిపివేయాలని రైతు సంఘాల నేతలు పిలుపు

– అన్నదాతలకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని విజ్ఞప్తి

దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయిం చారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ను ఈ సారి లక్ష్యంగా నిరసనకు పిలుపునిచ్చారు. కార్యక్రమం జరిగే సమయంలో రైతులు, ప్రజలు పాత్రలు చప్పుడు చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.అలాగే, సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఒక్కరైనా నిరాహార దీక్షలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాయి. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు హరియాణాలోని టోల్‌బూత్‌ల వద్ద రుసుములు నిలిపివేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 23 కిసాన్‌ దివస్‌ సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తోమర్‌ లేఖను దహనం చేసిన రైతులు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు మద్దతిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను రైతు సంఘాలు ఖండించాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు అఖిల భారత కిసాన్‌ సమన్వయ సంఘర్ష కమిటీ లేఖ రాసింది. తమ పోరాటం వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకునేలా రైతుల ఆందోళనలు.. చేశాయన్నారు. కీలక అంశాల నుంచి రైతుల దృష్టి మరల్చేందుకు తోమర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలు చిన్న, సన్నకారు రైతులకు మేలుచేస్తాయంటూ వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాసిన లేఖను రైతులు దహనం చేశారు. దిల్లీ-నొయిడా సరిహద్దు వద్ద భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో లేఖ ప్రతులను దహనం చేశారు.నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు నేటితో 25వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు వెనక్కి తగ్గడం లేదు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తుండగా, వాటిల్లో కొన్ని సవరణలు మాత్రమే చేపడతామని ప్రభుత్వం పేర్కొంటోంది. రైతులు, ప్రభుత్వం మధ్య పలుమార్లు చర్చలు జరిగినా సానుకూల ఫలితాలు రాలేదు.