ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనాకు షాక్
విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
బ్యాంకులను మోసం చేసిన కేసులో లుకౌట్ నోటీసులు
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపి
న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి ఊహించని షాక్ తగిలింది. విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సుజనాచౌదరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో.. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఎంపీ సుజనాచౌదరిని అమెరికా వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంలో ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని హైకోర్టులో సుజనా పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతంలో భారీ ఎత్తున సోదాలు జరిపింది. సుజనా గ్రూపు సంస్థలు బ్యాంకులను ఏకంగా రూ.5,700 కోట్ల మేర మోసం చేశాయని స్పష్టంగా ఆరోపించింది. ఈ మొత్తాలను బ్యాంకుల నుంచి తీసుకొని ఎగవేశాయనేందుకు గట్టి ఆధారాలు లభించాయని పేర్కొంది. దీనిపై తమ ఎదుట హాజరై, వివరణ ఇవ్వాలంటూ సుజనా చౌదరికి తాఖీదు జారీ చేసింది. దీనికోసం సోమవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. సుజనా గ్రూపులకు చెందిన సంస్థల్లో మరోసారి సోదాలు సాగించిన ఈడీ అధికారులు.. డొల్ల కంపెనీల పేర్లతో రిజిస్టేష్రన్ చేసిన ఆరు ఖరీదైన కార్లను ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ తదితర కార్లను స్వాధీనం చేసుకొన్నారు. సుజనా గ్రూప్ సంస్థల్లో చాలా మటుకు మనుగడలో లేవని, కేవలం కాగితాలపైనే కొనసాగుతున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సుజనా చౌదరి వ్యక్తిగత పూచీకత్తుపై బ్యాంకులు రూ.5,700 కోట్లు రుణం ఇచ్చాయని ఆ కోణంలో ఆయన్ను విచారించనున్నట్లు తెలిపారు. నిజానికి, చెన్నైలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా 2018 అక్టోబరులోనూ సుజనా చౌదరి సంస్థల్లో ఈడీ తనిఖీలు జరిపింది. ఆ తనిఖీల్లో లభించిన ఆధారాలు, కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా మరోసారి చెన్నై ఈడీ బృందం హైదరాబాద్ వచ్చింది. నాగార్జున హిల్స్‌లోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థలో తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఏడు వేర్వేరు ప్రాంతాలతోపాటు ఢిల్లీలో తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టామని ఈడీ అధికారులు తెలిపారు. సుజనా గ్రూప్ సంస్థలు బ్యాంకుల్ని రూ.5,700 కోట్లు మోసగించినట్లు తేలిందన్నారు. 120 సంస్థల పేర్లతో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారని, అందులో చాలా మటుకు సంస్థలు మనుగడలో లేవని తెలిపారు. తప్పుడు పత్రాలతో బ్యాంకుల్ని రూ.364 కోట్లు మోసగించారన్న బ్యాంకర్ల ఫిర్యాదుతో సీబీఐ బెంగళూరు విభాగం గతంలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. చెన్నైలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తప్పుడు పత్రాలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.159 కోట్లు రుణం తీసుకున్నదని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చింది. ఈ ఎఫ్‌ఐఆర్ మేరకు పీఎంఎల్‌ఏ చట్ట ప్రకారం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 2018, అక్టోబరు 8న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ముఖ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ నాగార్జున హిల్స్‌లోని కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో వేర్వేరు డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బరు స్టాంపులను ఈడీ స్వాధీనం చేసుకుంది. నాగార్జున సర్కిల్‌లోని ఈ సంస్థ ఆవరణలో సుజనా గ్రూపునకు సంబంధించిన పలు సంస్థల్ని నెలకొల్పినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో లభించిన ఆధారాలు, దర్యాప్తు ఆధారంగా సుజనా గ్రూప్ సంస్థలు… సుజనా చౌదరి చైర్మన్‌షిప్‌లో కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్న వారిని విచారించినపుడు, తాము కేవలం సుజనా చౌదరి ఆదేశాల మేరకే పనిచేస్తామని, బ్యాంకుల్లో నగదు మార్పిడికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.