ఢిల్లీ చేరుకున్న బాబు

గులాంనబీ ఆజాద్‌తో చర్చలు

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం దిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఆయన్ను ఎయిర్‌పోర్టులో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా వీరు కేంద్ర రాజకీయాలపై చర్చించారు. అనంతరం టిడిపి ఎంపిలతో కలసి ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ శరద్‌పవార్‌తోపాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతో చంద్రబాబు చర్చలు జరిపారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై వారు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు, వివిధ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న దాడులు, కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత ఫరూఖ్‌ అబ్ధుల్లా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని శ్రీరాముడే గెలిపిస్తాడని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారని ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కాని దేవుడు ఎన్నికల్లో నేతల విజయానికి సహాయం చేయడని…రాముడైనా, అల్లా అయినా… ప్రజలు ఓటు వేస్తేనే గెలుస్తారని చెప్పారు.