ఢిల్లీ పోలీస్ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్ నియామకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా కమిషన్ ఛైర్మన్‌గా విచారణ చేపట్టనున్నారు. అత్యాచార బాధితురాలి వాంగ్మూలం రికార్డు విషయంలో పోలీసుల జోక్యంపై సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఫిర్యాదుపై కూడా ఆమె విచారణ జరుపుతారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉషా మెహ్రాతో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉషా మెహ్రా చంఢీఘడ్‌లోని పంజాబ విశ్వవిద్యాలయం నుంచి బిఎ, ఎల్‌ఎల్‌బి పట్టా తీసుకున్నారు. ఢిల్లీలో హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఆమె 1984లో నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితులైన తొలి మహిళ ఆమె. 1990లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పరువు కోసం పాకులాడుతున్న నేపథ్యంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారు.