తగ్గిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు

నాణ్యతా లోపమే అంటున్న జనం

గుంటూరు,జూలై11(జనం సాక్షి)

): పట్టణంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఇప్పుడు అమాంతంగా పడిపోయింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు గతంతో పోలిస్తే 40 శాతంపైగా పడిపోయాయి. నాణ్యతా లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆన్‌లైన్‌ ఆర్డర్లతో హోటళ్ల వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా పెద్దఎత్తున సాగింది. అయితే ఈ ముచ్చట ఏడాది గడవకముందే తీరిపోయింది. ఏడాది క్రితం గుంటూరులో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ చేసే సంస్థలు ప్రవేశించాయి. విశేష ఆదరణ పొందాయి. ఒక్క వినియోగదారులకే కాకుండా హోటళ్లకు కూడా విపరీతమైన వ్యాపారాన్ని సమకూర్చిపెట్టాయి. అయితే ఏడాది తిరక్కుండానే ఆన్‌లైన్‌ ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఏ వీధిలో చూసినా, ఏ హోటల్‌ ముందు చూసినా రెండు ప్రఖ్యాత సంస్థల డెలివరీ బాయ్స్‌ దర్శనమిచ్చేవారు. కానీ ప్రస్తుతం వారి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. క్రమంగా ఈ మార్పు వచ్చిందని వ్యాపారులు కూడా అంగీకరిస్తున్నారు. నలుగురు కలిస్తే ఆర్డర్‌ ఇప్పించేలా వ్యవస్థ సృష్టించబడిరది. ఈ క్రమంలోనే క్వాలిటీ, క్వాంటిటీ పడిపోయాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో వినియోగదారులు అసంతృప్తి చెందారు. డెలివరీలు తగ్గించి నేరుగా హోటళ్ల నుంచి తెప్పించుకునేందుకే ఇష్టపడుతున్నారు. ఇదే విషయంపై డెలివరీ బాయ్స్‌ను అభిప్రాయం అడగ్గా పార్శిల్‌ అంటే నాణ్యత విషయంలో రాజీపడ్డారని, అదే విధంగా సాధారణంగా ఇచ్చే పరిమాణం కన్నా తగ్గించారని హోటల్స్‌లో కూడా వారి వద్దకు వచ్చే వినియోగదారుల కోసం ఒక రకం వంట, ఆన్‌లైన్‌ వారి కోసం ప్రత్యేకంగా మరో వంట తయారు చేశారని దీంతో ఆర్డర్లు తగ్గిపోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు 40 నుంచి 60 డెలివరీలు ఇచ్చిన వారు 10 నుంచి 15కు పరిమితం అవుతున్నామని దీంతో తమ ఆదాయం కూడా తగ్గిందని ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు వంద మంది వినియోగదారులు నేరుగా తమ హోటళ్లకు వస్తే ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల ప్రవేశం తరువాత 50 మంది వినియోగదారులు 50 ఆర్డర్లు వచ్చాయి. అప్పటి వరకు వ్యాపారం తేడా తెలియలేదు. కానీ ఆర్డర్లు 30కి పడిపోయాయి. కానీ వినియోగదారులు మాత్రం పెరగలేదు. కారణాలు అర్థం కావడం లేదని కొందరు హోటళ్ల యజమానులు వాపోయారు.