తగ్గిన ‘రోను’ తుపాను ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌ తీరంపై తుపాను తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుపాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం పరిధిలో దీని ప్రభావం తగ్గింది. ప్రస్తుతం కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది.

గంటకు 17 కిలోమీటర్ల వేగంతో.. ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. మందస్తు అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం 5.30గంటలకు ఏపీ తీరంలోనే తీవ్ర తుపానుగా మారుతుందని భావించారు. అయితే ఇది.. ఈ రాత్రికి ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. తుపాను ప్రభావంతో ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కళింగపట్నంలో 15, విశాఖలో 8, మచిలీపట్నంలో 7, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, ఒంగోలులో 6 సెం.మీ, గన్నవరం, బాపట్ల, తునిలో 3 సెంంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ఒడిశా తీరంవైపు వెళ్లిపోవడంతో… దక్షిణ కోస్తాకు వర్షాలు లేనట్లే. ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలపై ఈ రాత్రి వరకూ తుపాను ప్రభావం ఉండే అవకాశముంది.

 

తాజావార్తలు