తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
రైతులకు అధికారుల భరోసా
జనగామ,మే1(జనంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థ ద్వారా లేకుంటే ట్రేడర్లు, మిల్లర్ల సాయంతో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు అధైర్య పడద్దని అధికారులు, మార్కెట్ పాలకవర్గం భరోసా కల్పించిది. జనగామ యార్డులో తడిసిన ధాన్యం బస్తాలు, వర్షపునీటిలో కొట్టుకుపోయిన ధాన్యం గింజలను పరిశీలించి రైతులతో మాట్లాడి ఓదార్చారు. మార్కెట్‌లో పీఏసీఎస్, ఓడీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తడిసిన ధాన్యం బాయిల్డ్ రైస్ కస్టమ్ మిల్లింగ్ ద్వారా తమిళనాడుకు బియ్యం ఎగుమతి అవుతున్న దృష్ట్యా ఏలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆదివారం కురిసిన అకాల వర్షం దెబ్బకు యార్డులో సుమారు 65వేల ధాన్యం బస్తాలు, రాశులు తడిసిపోయాయి. వీటిలో దాదాపు 300క్వింటాళ్లకు పైగా ధాన్యం గింజలు వరదనీటి పాలయ్యాయి. అకాల వర్షాలతో మార్కెట్‌లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దగా మారింది. కేవలం ఒక్క ఏప్రిల్ నెలలోనే జనగామ వ్యవసాయ మార్కెట్‌లో మూడుసార్లు వేలాది బస్తాల రైతుల ధాన్యం తడిసింది. ఏప్రిల్ 1న, తిరిగి 22న, తాజాగా 29న సాయంత్రం ఎగువప్రాంత జనగామ జిల్లా రైతుపై ప్రకృతి మరోసారి పంజా విసిరింది.