తన ప్రభుత్వంపై గాట్లు పెట్టేవారి గోర్లు కత్తిరిస్తా – త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌


అగర్తలా,మే2( జ‌నం సాక్షి): ఇటీవల  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన త్రిపుర సిఎం విప్లబ్‌దేబ్‌ మరోసారి ప్రభుత్వాన్ని సొరకాయతో పోలుస్తూ వ్యాఖ్యానించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తన చూపుడు వేలును ప్రేక్షకులకు చూపిస్తూ మాట్లాడారు. తన ప్రభుత్వంపై ఎవ్వరూ చెయ్యి వేయలేరని, ప్రభుత్వం తనదికాదని, ప్రజలదని అన్నారు. తన ప్రజలపై చెయ్యి ఎత్తే ధైర్యం ఎవ్వరికీ లేదని అంటూ తన చిన్నపుడు సొరకాయ మాదిరి గానే ప్రభుత్వ సొమ్ముతో ఏమైనా చేయొచ్చు అని చాలా మంది చెప్పేవారని వ్యాఖ్యానించారు. అంటే కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్ద సొరకాయలు ఉంటే కొనడానికి వచ్చేవారంతా అది బాగుందా లేదా అంటూ పరీక్షించేందుకు గోళ్లతో గిల్లి చూస్తారని, దాంతో ఆ సొరకాయపై గాట్లు పడి ఎందుకూ పనికి రాకుండా పోతుందని ఉదాహరించారు. అదే విధంగా తన ప్రభుత్వంపై ఎవ్వరైనా గాట్లు పెట్టడానికి ప్రయత్నిస్తే వారి గోళ్లు కత్తిరించేస్తానని వ్యాఖ్యానించారు. గత నెలలో ఇంటర్నెట్‌ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో సోషల్‌విూడియాలే అనేకమంది వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే 1997లో మిస్‌ వరల్డ్‌గా కిరీటం గెలుచుకున్న డయానా హెడెన్‌ పై భారత్‌కు చెందిన ఐశ్వర్యరారు కంటే అందంగా లేదు అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన అనంతరం క్షమాపణలు చెప్పారు. అలాగే గతవారం సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా గ్రాడ్యుయేట్స్‌ అందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడకుండా పాన్‌షాప్‌లను పెట్టుకోవచ్చని, అలాగే యువకులు ఆవులను పెంచి పాలు ఉత్పత్తి చేయవచ్చని సూచించారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రధాని మోడీ విప్లబ్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.