తమిళనాట మారనున్న సవిూకరణాలు
స్టాలిన్,బాబు భేటీతో బలపడనున్న డిఎంకె
అన్నడిఎంకెను అడ్డంపెట్టుకుని బిజెపి చేసే యత్నాలకు గండి
చెన్నై,నవంబర్10(జనంసాక్షి): తమిళనాడులో రాజకీయ సవిూకరణాలు నాటకీయంగా మారుతున్నాయి. తమిళనాడులో ఎఐడిఎంంకెను అడ్డం పెట్టుకుని బిజెపి ఆడిన నాటకాలను ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. రెండాకులను చిందరవందర చేసిన కమల నాథులు, డిఎంకెను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ఇప్పుడు డిఎంకె కాంగ్రెస్ కూటమితోనే కొనసాగాలని నిర్ణయించుకుంది. తాజాగా చంద్రబాబుతో భేటీతో డిఎంకె మరింత బలంగా కూటమితో కలసి సాగాలని నిర్ణయించింది. తమిళనాడులో జయ మరణానంతరం నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసారగా చేసుకుని అక్కడ పాగా వేయాలని బిజెపి చూసింది. డిఎంకెతో చంద్రబాబు చర్చల తరవాత తమిళనాడులో కొత్త సవిూకరణాలకు దారితీసాయి. జయలలిత మరణానంతరం జరుగుతున్న వర్గపోరులో ఒక పక్షం తీసుకుని, ఎట్లాగైనా తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి తమిళ రాజకీయాలు వంటపడ్డం లేదు. ఎలా ముందుకు సాగాలో దిక్కుతోచడం లేదు. వాజ్‌పేయి లాంటి వారినే మట్టి కరిపించిన ఘనులు తమిళనాడు రాజకీయనేతలు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు కానీ, తరువాత కానీ అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పనిచేయాలని భావిస్తున్నదని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దశలో బిజెపికి తమిళనాట కూడా భంగపాటు తప్పదని పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. తమిళనాట బిజెపి చేస్తున్న రాజకీయాల కారణంగా
అక్కడ కూడా డిఎంకె అనుకూల ప్రత్యామ్నాయం అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, 2019 ఎన్నికలలో గెలవడం అంత సునాయాసం కాదని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అన్నా డిఎంకె మద్దతుతో సీట్లను సమకూర్చుకోవడం కోసమే దోస్తీకి దిగుతుందన్న ప్రచారం ఉంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గం, డీఎంకేలోని కొన్ని వర్గాలు కలసి కమల్ హాసన్‌లాంటి వారితో కొత్త బాటు వేసేందుకు కూడా యత్నాలు జరుగుతన్నాయి. అయితే కమలహాసన్, రజనీకాంత్‌ల పార్టీ వ్యవహారాలు ఇంకా స్పస్టంగా లేవు. అలాగే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ సొంతంగా ఒక శక్తిగా ఉండే పరిస్థితులయితే తమిళనాడులో లేవు. డీఎంకే యువనేతలు కోరి కోరి కొత్త రాజకీయ శక్తికి వేదిక ఇస్తారా, లేక, సాంప్రదాయికంగా ఉన్న ద్రావిడ వాద ప్రతిష్ఠను నిలుపుకుని మరొకసారి పూర్వవైభవాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారా అన్నది వేచి చూడవలసిందే. అయితే బిజెపికి వ్యతిరేకంగానే ఇక్కడి రాజకీయాలు ఉంటాయన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.