తమిళనాడుకు మరోమారు భారీ వర్షముప్పు

వాయుగుండాలతో వర్షగండం ఉందన్న వాతావరణశాఖ

చెన్నై,నవంబర్‌5(జ‌నంసాక్షి): తమిళనాడుకు మరోమారు భారీ వర్షాల ముప్పు తప్పేలా లేదు. దీపావళి

సందర్భంగా వర్షౄలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడం, మరోవైపు బంగాళా ఖాతంలో రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారనుండటంతో దీపావళి రోజున కుండపోతకు అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. గత 1వ తేదీన రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చెన్నై నగరంలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ అల్పవాయు పీడనం వాయుగుండంగామారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో 6వ తేదీన మరో కొత్త అల్పవాయుపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలా రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారే అవకాశం ఉండటంతో దీపావళి నాడు రాష్ట్రమంతటా ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.