తమిళనాడులో ఉక్కు మహిళ పెళ్లి

ఆఫ్సా’ చట్టానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల ఎట్టకేలకు తన మనసు గెలుచుకున్న బ్రిటిష్ పౌరుడు డెస్మాండ్ కోటిన్హోతో పెళ్లిపీటలెక్కనున్నారు.

ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని వారిద్దరూ ధ్రువీకరించారు. అయితే వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో ఉన్న ఈ జంట అక్కడే పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. షర్మిల నిర్ణయాన్ని ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్‌ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందన్నారు.

షర్మిల దీక్ష చేస్తున్న సమయంలో 2011లో ఆమెకు తొలిసారి బ్రిటీష్‌ పౌరుడు డెస్మండ్‌ పరిచయమయ్యారు. తర్వాత ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకున్నారు. వివాహం బంధంతో తామిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్టు డెస్మండ్‌ చెప్పారు. అనుమతులు తీసుకున్నాక తమిళనాడులోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ధ్రువీకరించారు.