తమిళనాడులో నామినేషన్లు వేసిన జయ, కరుణలు

Untitled-1

పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైగో

చెన్నై,ఏప్రిల్‌25 : తమిళనాడులో ఎన్నికల వేడి అందుకుంది. తాజా,మాజీ ముఖ్యమంత్రులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్‌ కరుణానిధి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జయలలిత సిట్టింగ్‌ స్థానమైన ఆర్కే నగర్‌ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. పార్టీ నేతలతో కలసి వచ్చిన జయ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. పన్నీర్‌ సెల్వం తదితరులు ఇందులో పాల్గొన్నారు. జయరాకతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.  ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలో మద్య నిషేధం విధించనున్నట్లు అన్నాడీఎంకే తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. జయలలిత నామినేషన్‌ వేసిన ప్రాంతానికి అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరుణానిధి సొంతూరు తిరువరూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. కొలతూర్‌ నుంచి పోటీ చేస్తున్న కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ 27న నామినేషన్‌ వేస్తారు. డీఎండీకే చీఫ్‌ విజయ్‌కాంత్‌, ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ఈ వారంలో నామినేషన్లు వేయనున్నారు. డీఎంకే చీఫ్‌ కరుణా నిధి తిరువరూర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారికి ఆయన తన నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు. కరుణానిధి నామినేషన్‌ వేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీకి మే 16న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే అనుహ్యంగా పోటీనుంచి తప్పుకుంటున్నట్లు వైగో ప్రకటించారు.  డీఎండీకే అధినేత వైగో తమిళనాడు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కోవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి ఆయన ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. కానీ వైగో స్థానంలో రమేశ్‌ అనే అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. రెండు దశాబ్దాల తర్వాత తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని వైగో కొద్ది రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని వైగో విరమించుకున్నారు. డీఎంకే తమిళనాడులో కుల రాజకీయాలు ప్రోత్సహిస్తుందని వైగో మండిపడ్డారు.వైగో చివరిసారిగా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విలత్తికులమ్‌ నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం 1998, 1999లో శివకాశి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో విరుధ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇకపోతే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రామేశ్వరంలో డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ భారీ బహిరంగసభ నిర్వహించారు. వేలాది జనం ఈ సభకు వచ్చారు. ఈ సందర్భంగా కెప్టెన్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఖడ్గాన్ని బహూకరించారు.