తమిళనాడులో రగిలిన సెగ

చెన్నై: హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్  ఆత్మహత్య ఉదంతం, ముగ్గురు  మహిళా వైద్య విదార్థినుల ఆత్మహత్యలపై  చెన్నైలో
ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనలపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా  విద్యార్థులు  నిరసనలకు దిగారు. రెండు ఉదంతాలపై  సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వందలమంది విద్యార్థులు నగరంలో కదంతొక్కారు.  దీంతో సుమారు  60  మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న విశ్వవిద్యాలయాల బంద్  తమిళనాడులోనూ కొనసాగుతోంది.  అటు హైదరాబాద్ లో  రోహిత్ ఆత్మహత్య, అటు ముగ్గురు మెడికోలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిరనస జ్వాలలు ఎగిసి పడ్డాయి.  కేంద్ర మంత్రుల వ్యవహారంపై విద్యార్థిలోకం  మండిపడుతోంది.  కేంద్ర మంత్రులు  బండారు దత్తాత్రేయ,  స్మృతి ఇరాని  తక్షణమే తమ పదవులకు  రాజీనామా చేయాలంటూ  డిమాండ్ చేస్తోంది.  దీంతో ఉద్రిక్తత రాజుకుంది.

కాగా హెచ్ సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది.  నేడు, రేపు రెండురోజులపాటు  కూడా ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు. అటు విల్లుపురంలో ముగ్గురు మెడికోల ఆత్మహత్య ఉదంతం కూడా  తమిళనాడును కుదిపేసింది.  దీంతో  నిరసనల సెగ చెన్నైను మరింత తీవ్రంగా తాకింది.