తమిళనాడులో రాజకీయ రగడ

వేడి పుట్టిస్తున్న తాజా పరిణామాలు
తప్పుడు వార్తలపై చర్య తీసుకుంటామని ప్రకటించిన రాజ్‌భవన్‌
గవర్నర్‌ రాజీనామాకు పట్టుబడుతున్న స్టాలిన్‌
సిబిఐ ఉచ్చులో సిఎం పళనిస్వామి
చెన్నై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  నక్కీరన్‌ వివాదం ఇంకా సమిసి పోయినట్లుగా లేదు. మరోవైపు సిఎం పళనిస్వామి వ్యవహారాలపై సిబిఐ దర్యాప్తు నకు హైకోర్టు ఆదేశించింది. ఓ వైపు గవర్నర్‌పై తప్పుడు వార్తలపై చర్యలు తీసుకుంటామని  హెచ్చరిస్తుండగా మరోవైపు గవర్నర్‌ రాజీనామా చేసేవరకు వదలబోమని విపక్షనేత స్టాలిన్‌ ప్రకటించారు. దీంతో తమిళనాడులో వ్యవహారాలు హాట్‌గా మారాయి.  విద్యార్థినులను పడుపువృత్తిలోకి దించేందుకు ప్రయత్నించి కటకటాల పాలైన అరుప్పుకోట అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి ఎన్నడూ గవర్నర్‌ భన్వరీ లాల్‌ పురోహిత్‌ కలవలేదని, అలాగే గవర్నర్‌ కార్యదర్శులు గానీ, ఇతర సిబ్బంది గానీ ఎన్నడూ ఆమెతో మాట్లాడలేదని రాజ్‌భవన్‌ స్పష్టం చేసింది. అయినా నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్‌కు సంబంధం అంటగట్టి ఊహాజనిత కథనాలు రాస్తే చర్యలు తప్పవని రాజ్‌భవన్‌ హెచ్చరించింది. ఈ మేరకు రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్మలాదేవి విద్యార్థినులతో మాట్లాడినప్పుడు ‘తాత’ ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంతో గవర్నర్‌కు సంబంధం వుందంటూ కథనం ప్రచురించిన ‘నక్కీరన్‌’ పత్రిక సంపాదకుడు గోపాల్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అది జరిగిన తరువాత విూడియాలోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ మరిన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌ భవన్‌ వివరణ ఇచ్చింది.  విూడియాలోని కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలు వండివారుస్తున్నారని ఆ ప్రకటనలో రాజ్‌ భవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మలాదేవితో గవర్నర్‌కు గానీ, రాజ్‌భవన్‌ అధికారులకు గానీ ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు నిర్మలాదేవి ఇచ్చిన వాంగ్మూలం పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రథమపౌరుడిపై ఇలాంటి దుష్పచ్రారం చేయడం, ఆయన్ని కించపరిచేలా, అధైర్యపరిచేలా రాతలు రాయడం సరికాదని సూచించింది. నక్కీరన్‌ పత్రికలో పేర్కొన్నట్టు గవర్నర్‌ కామరాజర్‌, మదరథెరిస్సా యూని వర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆయా వర్శిటీల గెస్ట్‌హౌస్‌లకు వెళ్లలేదని, అక్కడ ఆయన బస చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ తన పదవి నుంచి వైదొలిగే వరకు ఆందోళనలు విరమించలేది లేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ‘విడుదలై’ పత్రిక ఆధ్వర్యంలో స్థానిక వేప్పేరిలోని పెరియార్‌ హాలులో ‘పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ’ పేరిట జరిగిన సదస్సులో స్టాలిన్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పత్రికాస్వేచ్ఛను అడ్డుకొనేలా గవర్నర్‌ తీరు ఉందన్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్‌ తప్పు వుంటే, వున్నట్టు రుజువైతే ఆయన తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ డిమాండ్‌ చేశారు. మొత్తంగా ఇప్పుడు రాజ్‌భవన్‌ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి.