తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

జయ ఆస్పత్రి వీడియోలను బయటపెట్టిన దినకరన్‌ వర్గం
చెన్నై,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): తమిళనాడులోని కీలక ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆర్కె నగర్‌ ఉప ఎన్నికకు ఒకరోజు ముందు అనూహ్యంగా  దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో బయటపడటం సంచలనం సృష్టించింది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్‌ వర్గం బయటపెట్టింది. దినకరన్‌ వర్గానికి చెందిన పి. వెట్రివేల్‌ ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో అమ్మ ఆసుపత్రి బెడ్‌ విూద డ్రింక్‌ తాగుతూ కన్పించారు. దీనిపై వెట్రివేల్‌ మాట్లాడుతూ.. అమ్మను ఆసుపత్రిలో ఎవరూ కలవలేదనేది అవాస్తవమని చెప్పారు. ఆసుపత్రి అమ్మ చికిత్స పొందుతున్న వీడియో తమ వద్ద ఉందని.. దానిని నేడు విడుదల చేసినట్లు చెప్పారు.ఈ వీడియోను స్వయంగా శశికళే తీశారని తెలిపారు. ఈ వీడియోలు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వద్ద కూడా ఉన్నాయని చెప్పారు. తమ వద్ద ఇంకా వీడియోలు ఉన్నాయని.. అవసరమున్నప్పుడు వాటిని విడుదల చేస్తామన్నారు. అంతేగాక.. అమ్మ మరణంపై విచారణ కమిషన్‌ తమకు ఎలాంటి సమన్లు పంపలేదని.. ఒకవేళ పంపితే ఈ సాక్ష్యాలను విచారణ కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. 21న
గురువారం ఆర్కేనగర్‌కు ఉప ఎన్నిక జరగనుంది. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇలాంటి సమయంలో అమ్మ వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రయోజనాల కోసమే ఈ వీడియోను విడుదల చేశారనే అరోపణలు కూడా వెలువడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న జయలలితను గతేడాది సెప్టెంబర్‌ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. రెండు నెలలకు పైగా ఆసుపత్రిలో ఉన్న అమ్మ.. చికిత్స పొందుతూ 2016 డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కేవలం ఆమె నెచ్చెలి శశికళ కుటుంబసభ్యులు మాత్రమే జయలలితతో ఉన్నారు. దీంతో అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఇటీవల పన్నీర్‌ వర్గం నేతలు ఆరోపించారు. ఆసుపత్రిలో చేర్చేనాటికే జయలలిత మృతిచెందారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వీటిపై దినకరన్‌ కూడా స్పందించారు. అమ్మ ఆసుపత్రిలో బతికే ఉందని చెప్పేందుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని చెప్పారు. అయితే అమ్మ కోరిక మేరకు వాటిని విడుదల చేయబోమని చెప్పారు. తాజాగా ఆయన వర్గం ఎమ్మెల్యేనే వీడియోను బహిర్గతం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. జయలలిత మృతిపై దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
ఇప్పుడే ఎందుకు విడుదల చేశారన్నకేతిరెడ్డి
వీడియోపై తమిళనాడులో తెలుగు సేన నాయకుడు కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ జయ మరణించి ఏడాది గడుస్తోందని… ఇప్పుడు ఈ వీడియోను విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జయ మరణంపై అనుమానాలు వ్యక్తమైన సమయంలో వీడియోను విడుదల చేయకుండా ఇప్పుడు ఎందుకు విడుదల చేశారని నిలదీశారు. రేపు ఆర్కేనగర్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయంగా లాభపడటానికే దినకరన్‌ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందన్నారు. 2012లో జయపై శశికళ విషప్రయోగం చేసిందనే ఆరోపణలు వచ్చాయన్నారు. అలాగే జయ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఎవరినీ లోనికి అనుమతించలేదని… జయను శశికళ కుట్రపూరితంగా చంపిందనే ఆరోపణలు ఉన్నాయని కేతిరెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఇలాంటి వీడియోను విడుదల చేశారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా డబ్బును పంచకుండా దినకరన్‌ వర్గాన్ని ఎన్నికల అధికారులు నివారించడంతో కొత్తరకం పాచిక వేశారని కేతిరెడ్డి విమర్శించారు. ఆస్పత్రిలో జయ ఉన్న గదిలో సీసీఫుటేజ్‌ లేవని అప్పట్లో చెప్పారని మరి ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందన్నారు. ఈ
వీడియోను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆడే నాటకంలో ఈ వీడియో ఒక భాగమని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వీడియోను విడుదల చేసి దినకరన్‌ వర్గం ఎన్నికల కోడ్‌ను సైతం ఉల్లంఘించిందని అన్నారు.