తమిళనాడు వర్షాలకు ఐదుగురు బలి

చెన్నై,నవంబర్‌30(జ‌నంసాక్షి): తమిళనాడుపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తుఫాను ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటకకేంద్రం కన్యాకుమారి అతలాకుతలం అయ్యింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా అయిదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తోడు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఒక్కసారిగా చెట్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు బలంగా వీడయంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే కన్యాకుమారిలో హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు, సముద్రంలో వేటకు వెళ్లడాన్ని నిషేధించడమే కాకుండా, పర్యాటకులు సముద్రంలో ఈత కొట్టడంతో పాటు, బీచ్‌కి వెళ్లడంపై ఆంక్షలు విధించారు. అలాగే తిరునల్వేలి, కన్యాకుమారి, రామేశ్వరం, కొలాచల్‌ ఓడరేవుల్లో మూడోనెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇక వర్షాల కారణంగా కన్యాకుమారి నుంచి నాగర్‌ కోవిల్‌, త్రివేండ్రం వెళ్లే రైళ్లను నిలిపివేశారు. మరోవైపు తుఫాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా ఈ నెల మొదట వారంలో తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.