తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా!

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌ రావుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పన్నీరు సెల్వం లేఖలో పేర్కొన్నారు. తనను, తన మంత్రివర్గాన్ని రిలీవ్ చేయమని కోరారు. తన రాజీనామాను ఆమోదించాలని గవర్నర్‌ కు పన్నీరు సెల్వం విజ్ఞప్తి చేశారు.

ఇవాళ చెన్నైలో స‌మావేశ‌మైన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ‌శిక‌ళ‌ను పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నుకున్నారు. ప్ర‌స్తుత సీఎం ప‌న్నీర్‌ సెల్వం.. శ‌శిక‌ళ పేరును ప్ర‌తిపాదించగా.. ఎమ్మెల్యేలంతా ఏక‌గ్రీవంగా ఆమోదించారు. శశికళను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న లేఖను గవర్నర్ కు ఆ పార్టీ నేతలు అందజేయనున్నారు. శశికళను తమ నేతగా ఎన్నుకోవడంతో పన్నీరు సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది.