తర్కెమునీస్తాన్‌తో భారత్‌ కీలక ఒప్పందాలు

4

– 7 ఒప్పందాలపై సంతకాలు

– సహజవాయు పైప్‌లైన్‌పై చర్చ

– మోదీ పర్యటన విజయవంతం

న్యూఢిల్లీ,జులై11(జనంసాక్షి):

భారత ప్రధాని నరేంద్ర మోదీ, తుర్క్‌మెనిస్థాన్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శనివారం ఆదేశంలో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి ఆష్‌గాబట్‌ పట్టణంలో యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తుర్క్‌మెనిస్థాన్‌ తొలి అధ్యక్షుడు సపర్‌ మురాట్‌ నియాజోవ్‌కు మోదీ నివాళులర్పించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య వ్యాపారం బలోపేతం లక్ష్యంగా ప్రధాని మోదీ చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా తుర్క్‌మెనిస్థాన్‌లో పర్యటించారు. తుర్కెమెనిస్థాన్‌తో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్‌ ఓ ముందడుగు వేసింది. మధ్యఆసియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ తుర్కెమెనిస్థాన్‌లో పర్యటిస్తున్నారు.  ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తుర్కెమెనిస్థాన్‌తో భారత్‌ ఏడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దక్షిణ, మధ్య ఆసియాను అనుసంధానం చేయడం ద్వారా అపార ఆర్థిక అవకాశాల సృష్టి జరుగుతుందన్నారు. ఈ ఆలోచనతో ఏకీభవించి మద్దతిస్తున్న తుర్కెమెనిస్థాన్‌ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. భారత్‌-తుర్కెమెనిస్థాన్‌ బంధంలో అత్యంత కీలకమైంది.. తాపీ సహజవాయువు పైపులైను అని మోదీ స్పష్టం చేశారు.