తలదాచుకునేందుకెళ్తే .. ప్రాణాలు తీసింది


– కొండచరియలు విరిగిపడి 12మంది మృతి
– ఒడిశాలోని గజపతి జిల్లాలో విషాధ ఘటన
భువనేశ్వర్‌, అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ) : ప్రకృతి బీభత్సంలో సర్వం కోల్పోయిన ఆ గిరిజనులు కనీసం ప్రాణాలైనా కాపాడుకుందామని గుహలో దాక్కొన్నారు. అయితే అక్కడ కూడా విధి చిన్నచూపు చూసింది. కొండచరియలు విరిగి గుహ కుప్పకూలడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశాలో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాను ధాటికి బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుపాను
ప్రభావంతో గజపతి జిల్లా బారాఘరా గ్రామంలో ఉండే గిరిజనుల నివాసాలు కూలిపోయాయి. దీంతో ప్రాణాలు అరచేతులో పెట్టుకుని వారంతా సవిూపంలోని ఓ గుహలోకి వెళ్లారు. అయితే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి ఆ గుహపై పడ్డాయి. గుహ కుప్పకూలడంతో ఆ గిరిజనులంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అయితే అప్పటికే చాలా మంది మృతిచెందారు. ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను వెలికితీయగా మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ్‌బంగాల్‌ను తాకిన ‘తిత్లీ’..
ఒడిశా సహా ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన తిత్లీ తుపాను ఇప్పుడు పశ్చిమ్‌బంగాను తాకింది. దీంతోపాటు అసోం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరం, త్రిపురలోనూ తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఒడిశాలో బలహీనపడ్డ తుపాను ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ్‌బంగాలో ప్రభావం చూపుతుందని తెలిపింది. దీనివల్ల బంగాల్‌, అసోం, మేఘాలయ, మణిపూర్‌, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో భారీనుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ఒడిశా, బంగాల్‌ తీర ప్రాంతాల్లో సముద్రం తీవ్రమైన కల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ సూచించింది. ఇటు ఒడిశాలో తుపాను వల్ల ప్రభావితమైన 1,27,262 మంది 963 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని ఒడిశా అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఒడిశా విపత్తు స్పందన దళాలు సహాయక చర్యలు వేగవంతం చేశారని ప్రత్యేక అధికారి తెలిపారు.