తలసాని రాజీనా(డ్రా)మా
– రాజ్‌భవన్ ముందు టీడీపీ ధర్నా
– నేనెప్పుడో రాజీనామా చేశా
– మంత్రి తలసాని
హైదరాబాద్,జులై21(జనంసాక్షి):
తలసాని రాజీనామా వ్యవహారం మళ్లీ రాజుకుంది. ఆయనను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్‌ను కలిసిన తెలంగాణ టిడిపి నేతలు అనూహ్యంగా రాజ్‌భవన్ వద్ద రాజకీయ డ్రామాకు దిగారు. అక్కడ బైఠాయించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. ఇక తాను ఎప్పుడో రాజీనామా చేశానని, దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. దీనిపై ఎప్పుడు ఎన్నిక జరిగినా సిద్దంగా ఉన్నానని అన్నారు. భారత ప్రజాస్వామ్యంలో, శాసనసభ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా తాను స్పందిస్తున్నానని తెలగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తన గురించి మాట్లాడేవారి బండారం బయటపెడతానని అన్నారు. నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగా తనకు విషయాలు తెలుసునని అన్నారు. తాను స్పీకర్ కు రాజీనామా పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన ప్రకటించారు. గతంలో రాజీనామాలు చేసిన సందర్భాల్లో జరిగిన జాగును ఎందుకు ప్రశ్నించరని అన్నారు. ఇకపోతే వైకాపా నేతలను టిడిపిలో చేర్చుకుంటే ఎందుకు ప్రశ్నించరని అన్నారు. చట్టం అంతటా ఒక్కటే ఉంటుందని, ఆంధ్రకు, తెలంగాణకు వేరుగా ఉండదన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్దిలో పునరంకితం కావడానికే తాను టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. డిసెంబర్ 19 న తాను రాజీనామా చేసినప్పుడు విూరంతా ఉన్నారని విూడియా సమావేవంలో అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులును టిడిపిలో ఎలా చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇండిపెండెంటు కు మద్దతు ఇచ్చిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తొమ్మిది మందిపై అనర్హత వేటు వేయడానికి ఎంత కాలం తీసుకున్నారో తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు ఎస్.పి.వైరెడ్డి, కొత్త పల్లి గీత ఇప్పుడు టిడిపిలో ఎలా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు,చైతన్యరాజు,జూపూడి ప్రభాకరరావులు టిడిపిలో ఎలా చేరారని ఆయన అన్నారు. దిలీప్ , కంతెటి సత్యనారాయణరాజులు ఏ పార్టీకి చెందినవారు,ఇప్పుడు బిజెపిలో ఎలా ఉన్నారని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. స్పీకర్ ఒక పద్దతి పాలో అవుతారని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఎంతకాలం తర్వాత స్పీకర్ ఆమోదించారని శ్రీనివాస యాదవ్ అన్నారు. గతాన్ని తెలుసుకుని మసలుకోవాలని టిడిపి నేతలకు ఆయన హితవు పలికారు. ఇప్పుడు తనపై అవాకులు చెవాకులు పేలుతున్న గండ్ర వెంకటరమణ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని తలసాని నిలదీశారు. తన వెంటపడిన ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. నిబంధనల మేరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రకారం ముందుకెళ్తానన్నారు. నా పదవికి ఎప్పుడో రాజీనామా చేశా, ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నా, నాపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటా అని తలసాని ధీమా వ్యక్తం చేశారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన వారు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని కూడా సవాల్ విసిరారు. ఇదిలావుంటే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన తెలంగాణ టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్‌పెక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో 13మందిని అరెస్ట్ చేశారు. అంతకుముందు వీరు గవర్నర్ నరసింహన్ ను రాజ్‌భవన్‌లో కలిశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టులో ఉందని, దానిపై ఇప్పుడు స్పందించలేనని గవర్నర్ అన్నట్లు సమాచారం. గవర్నర్ స్పందన సరిగా లేదని ఆరోపిస్తూ వీరంతా రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు.