తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు

C

– ఎంసెట్‌ ర్యాంకర్ల తల్లిదండ్రులకు కడియం భరోసా

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌-2 రద్దు చేయడమా లేక కొనసాగించడమా అన్నది శుక్రవారం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు సిఐడి నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎర్రవల్లి వ్యవసాయ కేంద్రంలో ఉన్న సిఎం కెసిఆర్‌కు ప్రస్తుత పరిణామాలను తెలియచేశారు. దీంతో సిఎం శుక్రవారం ఓ అత్యున్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. కీలక వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో లీకేజీని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ నిషాద్‌, ముంబయికి చెందిన గుడ్డూ, హైదరాబాద్‌ వాసి వెంకట్రావ్‌ను సీఐడీ అధికారులు ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వీరిని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు ప్రస్తుతం ఏడుగురు నిందితులు సీఐడీ అదుపులో ఉన్నారు. ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు.. చేయాల్సిన విచారణను నివేదికలో వివరించనున్నారు. ఎంసెట్‌-2 పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని… ర్యాంకు సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సచివాలయంలో బుధవారం  రాష్ట్రమంత్రి లక్ష్మారెడ్డిని కలిసి.. పరీక్ష కోసం తాము పడిన కష్టాన్ని, రద్దు చేస్తే కలిగే నష్టాలను వివరించారు. నిజాయతీగా చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం చేయవద్దని.. లీకేజీకి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఐడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనుంది. మరోవైపు ఎంసెట్‌-2 పేపర్‌ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్‌-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గురువారం సచివాలయానికి చేరుకున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎదురు ధర్నాకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమత్రి కడియం శ్రీహరి గురువారం వరంగల్లో మాట్లాడుతూ  విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని హావిూ ఇచ్చారు. ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక  పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కడియం శ్రీహరి సూచించారు. పలువురు విద్యార్థులు మంత్రిని కలసి తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో సిఎంతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సీబీసీఐడీ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటమని కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ.. లీకేజీ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరుగుతుంది. అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ఈ వ్యవహారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.