తల్లిదండ్రులు మన్నించండి
సెప్టెంబర్ 11న ఎంసెట్-3 పరీక్ష
ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్ష
పరీక్ష ఫీజు మాఫీ.. పాత హాల్‌టికెట్లతోనే పరీక్ష
ఎంసెట్-3, బాధ్యతలు జేఎన్టీయూకే
కన్వీనర్‌గా రిజిస్ట్రార్ యాదయ్యకు బాధ్యతలు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
హైదరాబాద్,ఆగస్టు 2(జనంసాక్షి): ఎంసెట్-3 పరీక్ష షెడ్యూల్ ఖరారు చేస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. సెప్టెంబర్ 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎంసెట్-3 కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రిజిస్ట్రార యాదయ్యను నియమించారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ పరీక్ష రాయడం విద్యార్థులకు ఇబ్బంది కలిగే విషయం అయినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే దీనిపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంసెట్-3 పరీక్షకు ఎలాంటి రుసుములు చెల్లించనక్కర్లేదని.. పాత హాల్‌టిక్కెట్లతో విద్యార్థులు పరీక్షకు హాజరు కావొచ్చని వెల్లడించారు. ఉదయం క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఎంసెట్-2ను రద్దు చేసి తాజాపరీక్షకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈమేరకు ఇవాళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 11న పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం మళ్లీ జేఎన్‌టీయూకే అప్పగించింది. అయితే ఇప్పటి వరకు కన్వీనర్‌గా ఉన్న ఎన్‌వి రమణారావును తొలగించారు. మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవసరం లేకుండానే పాత హాల్ టిక్కట్లతోనే పరీక్ష నిర్వహిస్తారు. మొత్తంగా ఎంసెట్ -2పై సందిగ్ధం వీడింది. గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఎంసెట్-2ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, తాజాగా వచ్చేనెల 11న పరీక్ష నిర్వహిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రశ్నాపత్రం లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసెట్-2ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఎంసెట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు సహృదయంతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పరీక్ష రాసి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల చేత మరోసారి పరీక్ష రాయించడం బాధాకరమైన విషయమని సీఎం అన్నారు. తప్పని పరిస్థితుల్లోనే ఎంసెట్-3ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంసెట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎంసెట్-2 రాసిన విద్యార్థులు తిరిగి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత హాల్‌టికెట్లతోనే ఎంసెట్-3 నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అవసరమైన చోట ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఎంసెట్-3 ప్రవేశపరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంకు సహా జవాబులు జేఎన్టీయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం సూచించారు.




