తాగునీటిని పొదుపుగా వాడాలి

సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన తలసాని

హైదరాబాద్‌,ఆగస్టు30 : నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని పొదుపుగా తాగు నీటిని వినియోగించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జంట నగరాల ప్రజలను కోరారు. జంట నగరాల ప్రజలకు తాగునీటి కోసం చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో గండిపేట్‌, ఉస్మాన్‌ సాగర్‌ లలో నీటి కొరత ఏర్పడినప్పుడు కృష్ణానది నుంచి తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టిన సంగతిని గుర్తు చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశించడం ముఖ్యమంత్రి పారదర్శక పాలనకు నిదర్శమన్నారు. నాగార్జున సాగర్‌ లో డెడ్‌ స్టోరేజీ కన్నా తక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉండటంతో సీఎం కేసీఆర్‌ మంగళవారం రాత్రి నుంచి జంట నగరాల్లో తాగు నీటి కోసం సింగూరు నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.