తాగునీటి పథకాల నిర్మాణానికి భారీ నిధులు : కలెక్టర్
ఖమ్మం, నవంబర్ 3 : గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. మల్టీ విలేజ్ స్కీం కింద మంజూరైన మంచినీటి పథకాలను గ్రౌండింగ్ చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ పథకంలో మంజూరైన పనుల ప్రతిపాదనలను ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి సత్వరం అనుమతులు పొంది పనులు ప్రారంభించాలని అన్నారు. మల్టీ విలేజ్ స్కీం పథకం కింద ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి విద్యుత్ శాఖచే తొమ్మిది పనులకు డిమాండ్లు ఇవ్వాలని, నవంబర్ ఏడు నాటికి డిమాండ్ చెల్లించి పనులు ప్రారంభించాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ నుంచి ఐదు, నీటి పారుదల శాఖ నుంచి 9, ఎన్‌ఎస్‌పి నుంచి రెండు పనులకు అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించాలని అన్నారు. సాగునీటి పథకాల నిర్మాణానికి అధిగ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.