తాజ్‌మహల్‌ వద్ద యోగి స్వచ్ఛభారత్‌

వివాదాలకు చెక్‌ పెట్టే ప్రయత్నం

ఆగ్రా,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తాజ్‌మహల్‌ నిర్మాణం, చరిత్ర చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన వేళ అక్కడే

ఉత్తప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల తాజ్‌మహల్‌పై భాజపా నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో యోగి తాజ్‌ వద్ద ‘స్వచ్ఛభారత్‌’లో పాల్గొనటం విశేషం.ఈ సందర్భంగా ఆయన తాజ్‌ పరిసరాల్లో చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ ఇవాళ ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ను సందర్శించంతో పాటు ఈ పర్యాటక కేంద్రం వద్ద జరిగిన ‘స్వచ్ఛత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చీపురు పట్టిన ఆయన తాజ్‌ మహల్‌ పరిసరాలను ఊడ్చి శుభ్రం చేశారు.నేరుగా ఆగ్రాకు చేరుకున్న సీఎం యోగి.. తాజ్‌మహల్‌ పశ్చిమ గేటు ఎదుట ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు తొడిగి.. స్వయంగా చీపురుకట్ట పట్టుకొని రోడ్లను ఊడ్చారు. తాజ్‌ మహల్‌ నుంచి ఆగ్రా కోటవరకు పర్యాటకుల కోసం కాలిబాటను నిర్మించేందుకు శంకు స్థాపన చేయడంతో పాటు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేసారు. కాగా యోగి వచ్చిన సందర్భంగా తాజ్‌ మహల్‌ వద్ద బీజేపీ, హిందూ మహాసంఘ్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని భారత్‌ మాతాకీ జై.. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేయడం విశేషం. యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తాజ్‌ మహల్‌ని సందర్శించడం ఇదే తొలిసారి. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ ఆయన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అద్భుత కట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి తాజ్‌ మహల్‌ సందర్శనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజ్‌ మహల్‌ని ఎవరు నిర్మించారు… ఏ

కారణంతో నిర్మించారన్నది ముఖ్యంకాదు… భారత కార్మికులు తమ రక్తాన్ని, చెమటను చిందించి ఈ కట్టడాన్ని నిర్మించారు.. అని యోగి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజ్‌మహల్‌ భారత సంస్కృతిపై మచ్చ అని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ వ్యాఖ్యానించడం, తాజ్‌మహల్‌ ఒకప్పుడు శివాలయం ‘తెజోమహల్‌’ అని బీజేపీ నేత వినయ్‌ కటియార్‌ పేర్కొనడం కమలం పార్టీని ఇరకాటంలో నెట్టేసింది. ఈ వ్యాఖ్యల వివాదాన్ని తోసిపుచ్చిన సీఎం యోగి.. ఈ కట్టడాన్ని ఎవరు, ఎందుకు కట్టారన్నది ముఖ్యం కాదని, భారతీయ కార్మికులు తమ స్వేదం, రక్తం చిందించి తాజ్‌మహల్‌ను నిర్మించారన్న విషయాన్ని మరువరాదని పేర్కొన్నారు.