తాడు ఆటతో తగ్గే ఆకలి!

న్యూయార్క్‌ : బరువు తగ్గడం కోసం జిమ్‌లో వ్యాయమాల దగ్గరి నుంచి రన్నింగ్‌ దాకా ఎన్నో రకాలుగా ప్రయత్నించారా? ఎంత చేసినా ఆకలిని మాత్రం నియంత్రించుకోలేక పోతున్నారా? అయితే.. ఇక నుంచి తాడు ఆట మొదలు పెట్టేయండి! అదేనండీ ”రోప్‌ స్కిప్పింగ్‌”. రోజూ ఉదయాన్నే పరిగెత్తడం, ఇతర వ్యాయామాలు చేయడం కంటే.. కేవలం తాడాటతో ఆకలి తగ్గిపోతుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా శరీరంలో ఘ్రెలిన్‌ అనే హార్మోన్‌ విడుదలైనప్పుడు ఆకలి వేస్తుంది. తాడు ఆట వల్ల మొత్తం శరీరం పైకి, కిందికి కదులుతుంది. అదే సమయంలో కడుపు, దానిలోని అవయవాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీంతో ఘ్రెలిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతుందని, అది చివరికి బరువు తగ్గడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.