తిరుమలకు రానున్న రాష్ట్రపతి

భారీగా భద్రతా ఏర్పాట్లు

తిరుపతి,ఆగస్ట్‌30 : తొలిసారిగా తిరుమలకు వస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాకను దృష్టిలో పెట్టుకుని భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో తిరుపతి, తిరుమలలో కోవింద్‌ పర్యటించనున్నారు. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తొలిసారిగా తిరుమలకు వస్తున్నారు. సెప్టెంబర్‌ 1న ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడే పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రపతి కోవింద్‌కు పౌర సన్మానం జరగనుంది. ఇక రూ. 25 కోట్లతో అంబేద్కర్‌ సిల్క్‌ డెవలప్‌మెంట్‌ అకాడవిూకి శంకుస్థాపన చేస్తారు. దళితులకు రూ. 2 కోట్ల రుణాలు, భూపట్టాలు పంపిణీ చేసి అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి అక్కడ బస చేస్తారు. 2వతేదీ ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళతారు. కాగా… రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో తిరుమలలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.