తిరుమలలో ఆలయాలను సందర్శించుకున్న రాష్ట్రపతి
తిరుమల,జులై1(జనంసాక్షి):
శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడల్లా కొత్త శక్తిని పొందుతానని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. తాను ఎన్నోసార్లు తిరుమలకు వచ్చినట్లు చెబుతూ,వచ్చిన ప్రతిసారి మరింత శక్తిని పొందినట్లు తెలిపారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కల్పించాలని దేవుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రణబ్ ముందుగా శ్రీవరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి తితిదే ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. మేళతాళాలతో రాష్ట్రపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరు లో పద్మావతి అమ్మవారిని సందర్శించారు. ఉదయం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం దర్శించి అక్కడినుంచి నేరుగా తిరుమలకు వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరుమల పర్యటన నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని నిలిపివేశారు. రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకుని వచ్చేంతవరకు అన్ని దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ముందుగానే ప్రకటించారు.
అలిపిరి వద్ద రాష్ట్రపతి కాన్వాయ్‌లోని ప్రమాదం
తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా రాష్ట్రపతి కాన్వాయ్‌లోని వాహనం స్వల్ప ప్రమాదానికి గురైంది. అలిపిరి వద్ద కాన్వాయ్‌లోని ఓ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించి కాన్వాయ్‌ను కొండపైకి పంపించారు. వివిఐపి ల కాన్వాయ్ లు వేగంగా వెళుతుంటాయి. అప్పుడ ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయికి కూడా ప్రమాదం తప్పలేదు. ఎవరికి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు.