తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం
తిరుమల,అగస్టు2(జనంసాక్షి): శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి కలిసి పురుశైవారితోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర నిర్వహించారు. అనంతరం అనంతాళ్వార్ వైభవం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి ఏటా తిరువాడిపురం శాత్తుమొర నిర్వహిస్తున్నది. కాగా, సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి బయల్దేరారు. మార్గమధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, శఠారి సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి అలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు, వీజీఓ బాలిరెడ్డి, ఏవీఎస్వో సురేంద్ర, అనంతాళ్వార్ వంశస్తులు పాల్గొన్నారు.