తిరుమల భక్తులకు ఆర్జిత సేవల భాగ్యం

ఎప్రిల్‌ 1 నుంచి పునరుద్దరణకు నిర్ణయం
తిరుమల,మార్చి8(జనం సాక్షి): శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకారం.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్‌ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహిస్తారు. కోవిడ్‌`19 పరిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్‌ కొనసాగుతుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్‌ విధానం కూడా కొనసాగుతుంది. వర్చువల్‌ సేవలను బుక్‌ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు. వారికి దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు అందించడం జరుగుతుంది. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్‌ చేసుకున్న వారిని ఏప్రిల్‌ 1వ తేదీ నుండి కోవిడ్‌`19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తారు.