తీరుమార్చుకోని చైనా

 

డోక్లామ్‌లో భారత్‌ వెనక్కి తగ్గిందని సరికొత్త వ్యాఖ్య

బీజింగ్‌,ఆగస్ట్‌30 : చైనా తీరు మారలేదు. దౌత్యపరంగా డోక్లామ్‌ సమస్యను ఎంతో హుందాగా పరిష్కరించిన భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. రెండు దేశాల పరస్పర అంగీకారంతోనే

ఈ సమస్య పరిష్కారమైనదని అందరికీ తెలుసు. కానీ ఈ వివాదం నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చైనా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుండటం గమనార్హం. మంగళవారం చైనా మిలిటరీ జనరల్‌ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు సాక్షాత్తు ఆ దేశ విదేశాంగ మంత్రే బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ విూడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న బ్రిక్స్‌ సమావేశాల గురించి

వివరిస్తూ ఆయన డోక్లామ్‌పై స్పందించారు. డోక్లామ్‌ నుంచి వెనక్కితగ్గి చైనా తన పరువు కాపాడుకుందా అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు వాంగ్‌ బదులిస్తూ.. ఈ వివాదం భారత బలగాలు గీత దాటడం వల్ల తలెత్తింది. ఇప్పుడు అది సమసిపోయింది అని ఆయన సమాధానమివ్వడం గమనార్హం.

విూడియాలో ఎన్నో పుకార్లు వస్తాయని, అధికారికంగా చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనే వాస్తవాలను ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. 70 రోజుల ఈ వివాదానికి సోమవారం ఫుల్‌స్టాప్‌ పడిన విషయం తెలిసిందే. దౌత్యపరంగా రెండు దేశాల అంగీకారంతో రెండు వైపుల బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని ఇండియా చెప్పింది. అయితే ఈ విషయంలో తమదే విజయం అని వాంగ్‌ యీ అన్నారు. గీత దాటిన భారత బలగాలు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్లిపోయాయని, సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఇక నుంచైనా మంచి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని ఓ ఉచిత సలహా కూడా ఆయన ఇచ్చారు. రెండు పెద్ద దేశాల మధ్య ఇలాంటి విభేదాలు సహజమేనని, అయితే వాటిని సరైన రీతిలో పరిష్కరించుకోవడమే గొప్ప విషయమని అన్నారు.