తీర్పును సవరించలేం


– ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే ఉపయోగించాలి
– స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) :  దేశంలో టపాసుల క్రయవిక్రయాలపై నిషేధించే అంశంపై ఇచ్చిన తీర్పు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను మార్పులు చేసేది లేదని బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో తప్పనిసరిగా గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే ఉపయోగించాలని ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ఇతర టపాసులు ఉన్నప్పటికీ ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో వాటి క్రయవిక్రయాలు జరిపేందుకు న్యాయస్థానం ఎంతమాత్రం అంగీకరించలేదు. ఇక తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఇతర దక్షిణాది రాష్టాల్లో తెల్లవారుజామున 4గంటల నుంచి 5గంటల వరకు, రాత్రి 9గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని పేర్కొంది. కానీ కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు ఇచ్చిన సమయంలో మార్పులు చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో టపాసుల విక్రయాలపై నిషేధం విధిస్తున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ పండుగ సీజన్‌లో గ్రీన్‌ క్రాకర్స్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. తయారీదారులు ఇప్పటికే ఉత్పత్తి చేసిన టపాసులను ఈ ఒక్క సంవత్సరానికి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో విక్రయించుకోవచ్చని తెలిపింది. దీపావళి, ఇతర పర్వదినాల్లో టపాసులు కాల్చే వేళలకు సంబంధించి విధించిన కాలపరిమితిపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.