తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కాబోయే సిఎం రేవంత్‌రెడ్డి సూచన
హైదరాబాద్‌(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో అధికారులకు సూచించారు. లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోయే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోందని, ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలని, ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారా యణపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సవిూక్షించుకోవాలని, విద్యుత్‌, రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి కోరారు.