తుమ్మముల్లు తమ్మలనా.. పువ్వాడ పువ్వులా..?

` ఏదీ కావాలో మీరే నిర్ణయించుకోండి
` ఖమ్మంలో ఐటీ టవర్‌ను కలలో ఊహించామా?
` కాంగ్రెస్‌ పాలకుల చేతగాని తనంవల్లే సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా
` బీఆర్‌ఎస్‌ది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌..
` మూలకుపడ్డ వ్యక్తిని మంత్రిని చేస్తే.. సాధించిన ఫలితం గుండుసున్నా..!
` ఢల్లీి గులామ్‌లకు గులామ్‌ అవుదామా?
` బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే ప్రజల కోసం..
` నాడు గోదావరిని చూసి సంతోషపడేది తప్ప.. చుక్క నీరురాలే
` గిరిజనులకు భూములు పంచాం..
` నేడు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం
` మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..
` ఖమ్మం, కొత్తగూడెంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ జోరు కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వివిధ జిల్లాల్లో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా బాగా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ప్రజాస్వామ్య పరిణితి సాధించి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని సీఎం అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి కోసం యువత కృషి చేయాలని సూచించారు.సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నేకొక్కటే మనవి చేస్తున్నా. ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. అయినా దేశంలో ఇంకా ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ఎన్నికలు వస్తుంటయ్‌, పోతుంటయ్‌. ఎన్నికలు వచ్చినప్పుడు మూడు నాలుగు పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులుగా కూడా కొందరు అభ్యర్థులు బరిలో దిగడం, ఈ అందరిలో ఒకరు మాత్రమే గెలువడం అనేది సర్వసాధారణంగా జరిగేదే. కానీ దేశంలో ప్రజ్వాసామ్య పరిణితి రావాలంటే యువత ముఖ్యంగా ముందుండాలి. ఓటు వేసేటప్పుడు విచక్షణతో ఆలోచించి ఓటేయాలి. అక్షర జ్ఞానం లేని వాళ్లకు యువత ఓటు విలువ తెలియజెప్పాలె. ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలి. అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలి. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను చూడాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటది..? ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది..? అనేది ఆలోచించాలి. ఇలా విచక్షణతో ఆలోచించి ఓటేయాలి. అప్పుడే భవిష్యత్‌లో మరింత మంచి జరుగుతది. ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక్క వజ్రాయుధం ఓటు. విూరంతా చైతన్యవంతులు కాబట్టి బాగా ఆలోచించి ఓటేయాలి’ అని సీఎం సూచించారు.‘ఖమ్మం జిల్లాకే చెందిన కవి రావెళ్ల వెంకట్రామారావు తెలంగాణ రాకముందు 70, 80 ఏళ్ల క్రితం ‘నా తల్లి తెలంగాణరా.. వెలలేని నందనోద్యానమ్మురా’ అని పాట రాశారు. ఇవాళ ఖమ్మం పట్టణం చూసి గర్వపడుతున్నా. ఒకప్పుడు మన గోర్లపాడు ఎట్లుండే..? ఎంత మురికి ఉండే..? ఎన్నేళ్లు మనం ఆ మురికి కంపు భరించినం..? విూరు ఆలోచించాలె. మన లకారం చెరువు ఒకప్పుడు ఎంత వికారంగా ఉండెనో ఇప్పుడు ఎంత సుందరంగా తయారైందో విూరు ఆలోచించాలి. పువ్వాడ అజయ్‌, నేను వాటి దుస్థితి చూసి రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి చేసినం. ఇవాళ ఖమ్మంలో వైకుంట ధామాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ అద్భుతంగా ఉన్నయ్‌. ఒకప్పుడు మురికిల పెట్టి కూరగాయలు అమ్మాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి అయినా ఆ కూరగాయలు తినాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, దర్గంధంతో కూడిన పట్టణంగా ఉండె. ట్రాఫిక్‌ కష్టాలు, యాక్సిడెంట్స్‌కు నిలయంగా ఉండె. ఇప్పుడు ఖమ్మం అంటే సిక్స్‌ లేన్‌ రోడ్స్‌. సందుల్లో కూడా వైట్‌ టాప్‌ సిమెంట్‌ రోడ్స్‌. దారి పొడవునా దగదగలాడే లైట్స్‌, పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ ఏదో మంత్రమేస్తే జరగలే. విూ మంత్రి పువ్వాడ అజయ్‌ కష్టపడి పనిచేస్తే జరిగింది. పువ్వాడ ప్రజల మధ్య ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ‘వాడవాడలా పువ్వాడ’ అని నేను పేపర్లలో చదివిన’ సీఎం తెలిపారు.‘ఒకప్పుడు ఖమ్మం పట్ణణంలో రోడ్‌ నెట్‌వర్క్‌ 400 కిలోవిూటర్లు ఉండె. ఇప్పుడు దాన్ని 1,115 కిలోవిూటర్లకు తీసుకుపోయినం. ఒకప్పుడు మోరీల పొడవు 205 కిలోవిూటర్లు ఉండె. ఇప్పుడు దాన్ని 1,592 కిలోవిూటర్లకు తీసుకుపోయింది పువ్వాడ కాదా అని నేను అడుగుతున్నా. గోర్లపాడు ఛానెల్‌, లకారం చెరువు చిటికేస్తే అభివృద్ధి కాలే. ఏడు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే అయినయ్‌. లకారం చెరువు నగరవాసులకు ఆనందాన్ని పంచే ప్రదేశంగా తయారైంది. ఒకప్పటి లకారానికి ఇప్పటి లకారానికి పోలికే లేదు. దంసులాపురం బ్రిడ్జి గురించి కావచ్చు, మునేరు పొంగితే వరదలు వచ్చే ప్రాంతాల గురించి కావచ్చు అజయ్‌ దాదాపు నాతోటి పంచాయితీనే పెట్టుకున్నడు. పట్టుబట్టి రూ.700 కోట్ల నిధులను మంజూరు చేయించుకుని అభివృద్ధి పనులు చేసిండు. పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అజయ్‌ చూస్తున్నడు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా. దయచేసి మంచి చెడు ఆలోచించి ఓటు వేస్తే విూకు ఇంకా మంచి జరుగుతది. పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు. కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే విూకే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటయ్‌. మరి తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో విూరే తేల్చుకోండి’ అని సీఎం వ్యాఖ్యానించారు.
ఖమ్మంలో ఐటీ టవర్‌ను కలలో ఊహించామా?
ఖమ్మం నగరంలో ఐటీ టవర్‌ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్‌ అన్నారు.‘పువ్వాడ అజయ్‌కుమార్‌కు మెడికల్‌ ఉన్నది. అయినా కూడా నాతో కొట్లాడి పట్టుపట్టి ఖమ్మానికి కూడా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పెట్టించిన ఘనత ఆయనకే చెందుతుంది. రవాణాశాఖ మంత్రిగా ఉన్నందుకు అడ్వాంటేజ్‌ తీసుకున్నడు. హైటెక్ట్‌ బస్టాండు కట్టిండు. రూ.40కోట్లతో ఆర్టీసీ కల్యాణమండపం కట్టించిండు. ఇవన్నీ పనులు క్రమపద్ధతి ప్రకారం.. కమిట్‌మెంట్‌తో పని చేస్తే ఇలా తయారవుతుంది. బయటకు కూడా ఇలాగే ఖమ్మం పట్టణంలాగే కనీస వసతులు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నయ్‌’ అన్నారు.
ఇన్వర్టర్‌ లేదు.. జనరేటర్‌ లేదు..
‘మంచినీళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనే పాలేరు రిజర్వాయర్‌ ఉన్నా వారినికి ఒకసారి నీళ్లు వచ్చేది. బిందెలతో యుద్ధాలు జరిగేవి. ఇవాళ 75వేల ట్యాప్‌ కన్షెన్లు ఖమ్మం ఉన్నయ్‌. ఒక్క రూపాయికే పేదలకు కనెక్షన్‌ ఇచ్చేలా పాలసీ తీసుకువచ్చాం. గతంలో కరెంటు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలి. గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్‌, కన్వర్టర్‌, స్టెబిలైజర్‌, కలిగిన వారైతే జనరేటర్‌ ఉండేవి. ఇవాళ ఇన్వర్టర్‌ లేదు.. కన్వర్టర్‌ లేదు.. లో వోల్టేజీ లేదు.. కాలిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు. రూ.300కోట్లతో రఘునాథపాలెం మండలాన్ని అద్భుతంగా చేశారు. రఘునాథపాలెంలో వెతుకుదామంటే ఇవాళ మట్టిరోడ్డు లేదు. ఒకప్పుడు మట్టికొట్టుకుపోయిన రోడ్లే ఉండేవి. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు వేయించి.. కొత్త 20 గ్రామ పంచాయతీలు చేయించి అద్భుతంగా రూరల్‌ మండలాన్ని తీర్చిదిద్దారు అజయ్‌కుమార్‌. ప్రభుత్వానికి ఉన్న విజన్‌.. అజయ్‌ మిషన్‌ తోడైతెనే అభివృద్ధి జరిగింది’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.
మూలకుపడ్డ వ్యక్తిని మంత్రిని చేస్తే.. సాధించిన ఫలితం గుండుసున్నా..!
ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శుభ్రంగా ఉందని.. భవిష్యత్‌లో మంచి ఫలితాలు రాబోతున్నాయని సీఎం అన్నారు. ‘ఖమ్మంలో ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల గుణగణాలు విూకు తెలుసు. ఒకాయన అయితే చాలా గొప్పవాడు. పోయినసారి ఓడిపోతే మంత్రి పదవి ఇచ్చిన అని నేను చెబితే.. నాకే మంత్రి పదవి ఇచ్చిన అని చెప్పిండు. అదంత చరిత్ర విూ కండ్ల ముందున్నది. విూ సాక్షిగా జరిగింది. ఇదే అజయ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయి మూలకుపడి ఉంటే.. మంత్రిని చేసి జిల్లా అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా. ఒక్క అజయ్‌ తప్ప ఎవరూ గెలువలేదు’ అంటూ గుర్తు చేశారు.‘మొన్న సత్తుపల్లి సభలో చెప్పాను. ఈ జిల్లాలో ఇద్దరు కరకట ధమనకులు ఉన్నరు. చిన్నయ్యసూరి కథ చదివితే కరకట ధమనుల కథ, చరిత్ర తెలుస్తుంది. వీరిద్దరి పీడ వదిలించిన ఖమ్మానికి. శుభ్రంగా ఉన్నది. మంచి ఫలితాలు ఖమ్మంలో రాబోతున్నయి. ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా పద్ధతి ఉంటది. మాటలు అందరికీ వస్తయ్‌. తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? రేపు గియ్యాళ్లదాక తిట్టొచ్చు. అదికాదు కదా రాజకీయం అంటే.. అరాచకంగా మాట్లాడకూడదు. బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లను ఒక్కరినిగూడ.. అసెంబ్లీ గడప తొక్కనియ్య అని ఒక అర్భకుడు మాట్లాడుతున్నడు. నువ్వు ఖమ్మం ప్రజలను గుత్తపట్టినవా? జిల్లాకు జిల్లానే కొనేసినవా? ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా? ప్రజాస్వామ్యవాదులు దీన్ని సహిస్తరా? ఎంత వరకు ఇది ధర్మం. ఇది చైతన్యవంతమైన జిల్లా. పోరాటాల ఖిల్లా. కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎంతో చైతన్యం తీసుకువచ్చాయి. అందుకే మొదట విూతో ప్రార్థించింది.. విక్షణాయుతంగా ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో.. ఎవరి చేతుల్లో తెలంగాణ సురక్షితంగా ఉంటదో విూ అందరికీ తెలుసు’నన్నారు.‘బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ జెండా ఎత్తినయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజానికి ఎత్తుకున్నరా? మనం ఎత్తుకున్నప్పుడు మనల్ని అవమానించారు.. కాల్చి చంపారు.. జైళ్లలో పెట్టారు తప్పా వాళ్లకు ఎందుకు ప్రేముంటదు. కాంగ్రెస్‌ నాయకులకు సొంతం కథ ఉండదు. ఢల్లీిలో స్విఛ్‌ వస్తేనే ఇక్కడ లైట్‌ వెలుగుతుంది. మరి ఢల్లీి గులామ్‌ల కింద ఉండి.. మనం కూడా గులామ్‌ అవుదామా? ఈ రోజు ఖమ్మంలో చెబుతున్నా.. కేసీఆర్‌ అన్నట్లే నిజమైందని అంటరు. రాబోయే రోజంతా కూడా ప్రాంతీయ పార్టీల యుగం రాబోతున్నది. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే.. ఆ రాష్ట్రం ప్రయోజనాలు కాపాడుతారు. వాళ్లకు కడుపు నొప్పి ఉంటది.. కాళ్ల నొప్పి ఉంటది.. చేసుకుంటరు.. ఎలా ఉన్న ఖమ్మాన్ని.. ఐదారేళ్లలో ఎలా చేసుకున్నాం విూ కండ్ల ముందే ఉన్నది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నింటిపై విచారం చేసి, ఆలోచించి అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను గెలిపించాలని కోరుతున్నా’అంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

బీఆర్‌ఎస్‌ది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌..
` కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌
బీఆర్‌ఎస్‌ది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగ సోదరులకు మనవి చేస్తున్నా. విూరందరూ గత ప్రభుత్వాలను చూశారు. పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీల ప్రదర్శన చేయలేదు. ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఎలా వెళ్తున్నామో తెలుసు. చిన్న ఉద్యోగులు, కాంటాక్ట్‌ ఔటర్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కడుపులు నింపాలని.. భారత్‌లోనే తొలిసారిగా పీఆర్సీ ఇస్తే.. దాంతో సమానంగా జీతాలు పెంచింది చూశారు. సింగరేణి ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నమో చూస్తున్నది. ఓటు అనేది తమాషాగా, అలవోకగా వేయకుండా.. వేయకుండా ఈ విషయాలను ఆలోచించి.. చర్చించి ఓటు వేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది’ జరుగుతుందన్నారు.‘బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఆ నాడు నేను బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు. కేసీఆర్‌ బక్కగున్నడు.. ఎవరో బొండిగి పిసికి చంపేస్తరు.. ఎక్కడి తెలంగాణ ? యాడ వస్తదని మాట్లాడిరడ్రు. నేను ఒక్కడినే అయినా.. నాతో పిడికెడు మందే ఉన్నా.. పక్షి తిరిగినట్టు తెలంగాణ మొత్తం తిరిగి.. సమాజాన్ని జాగృతం చేసి.. ఉప్పెలా తయారు చేస్తే అద్భుతంగా మనం రాష్ట్రం సాధించుకున్నాం. కొత్తగూడెం పట్టణానికి కనీసం రెండు డజన్ల సార్లు వచ్చాం. ఆ నాడు సభలు కూడా పెట్టం. నాతో కలిసి చాలా మంది మిత్రులు పని చేసినవారున్నారు. ఆ ఉప్పెనను చూసి దేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే.. ఇది న్యాయమైన విషయమని 34 పార్టీలు మద్దతు తెలిపితే రాష్ట్రం తెచ్చుకోగలిగినాం. తెచ్చిన తెలంగాణను కొత్త సంసారాన్ని ఎలా వెళ్లదీస్తామో అలా.. నడుపుతున్నాం’ అన్నారు.‘ఉద్యోగులకు సంక్షేమం చేస్తున్నాం. చిన్న ఉద్యోగులను ఆదుకుంటున్నాం. కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. అన్నివర్గాల ప్రజలు ఏకతాటిపై ముందుకు సాగుదాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే.. పాత ఖమ్మం జిల్లా బంగారు తునకలా తయారైతది. కరువు అనేది మనకు రానే రాదు. కొత్తగూడెం జిల్లా గిరిజనులు ఉండే జిల్లా. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. వనమా వెంకటేశ్వర్‌రావు పెద్ద మనిషి. గ్రామ పంచాయతీ వార్డ్‌ మెంబర్‌ నుంచి మంత్రి వరకు రాజకీయాల్లో ఎదిగారు. కోరి కోరి ఆయనను తెచ్చుకున్నాం. వనమా వెంకటేశ్వర్‌రావుకు ఓటు వేయాలి.మంచి వ్యక్తి, కొత్తగూడెం నియోజకవర్గానికి ఎంతో చేయాలని తపన పడుతుంటారు. నా దగ్గరకు ఎన్నో సార్లు ఆయన వచ్చారు. ఏ సమయంలోనూ వ్యక్తిగత పనులు అడుగలేదు. నియోజకవర్గ పనులు అడిగారు తప్ప వ్యక్తిగతమైన పనులు అడుగలేదు. అలాంటి మంచి వ్యక్తిని కొనసాగితే కొత్తగూడెం చాలా బాగుపడుతుంది. నేను ఎన్నికల తర్వాత ఐదారు సార్లు కొత్తగూడెం వస్తాను. సవిూక్ష చేద్దాం.. ఏ పద్ధతుల్లో తీసుకుపోవాలో అలా ముందుకుపోదాం. అందరూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌కు ఓటేసి.. నవంబర్‌ 30 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించే వనమా వెంకటేశ్వరరావు భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనదైన స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘భద్రాద్రి సీతారామ చంద్రస్వామి కొలువుదీరిన ఈ పావన భూమికి నేను శిరసు వంచి నమస్కరింస్తున్నా. ఆ స్వామి పేరునే ఈ జిల్లాకు పెట్టుకున్నాం. నేనో నాలుగు విషయాలు చెప్పదల్చుకున్నా. శ్రద్ధగా వినండి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యింది. అయినా దేశంలో రావాల్సినంత రాజకీయ పరిణతి రాలేదు. ఎన్నికలొస్తే అబద్ధాలు చెప్పడం, బూతులు తిట్టుకోవడం, మోసపూరిత వాగ్ధానాలు. ఇదీ మన దేశంలో జరుగుతున్న తంతు’ అన్నారు.‘ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వజ్రాయుధం లాంటి ఆయుధం ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే మన తలరాత కింద విూదైతది. ప్రజలు కోరుకున్న వాళ్లు గెలిచినప్పుడే అది ప్రజల గెలుపు అయితది. కాబట్టి బాగా ఆలోచించి ఓటేయాలి. మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీల ఉంటరు. ఆ ముగ్గురిలో ఎవరు మంచి వ్యక్తో చూడాలి. పార్టీల వైఖరి, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా ఆలోచించి ఓటేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతది’ అని సీఎం సూచించారు.‘సింగరేణి కథ విూకు తెలియాలి. 134 సంవత్సరాల చరిత్ర ఉన్నది మన సింగరేణికి. తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఈ సింగరేణి వందకు వందశాతం మనకే ఉండే. ఇది తెలంగాణ ఆస్తి. తెలంగాణ సొత్తు. చేతగాని దద్దమ్మ కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి.. 30`40 ఏళ్లు అప్పులు తిరిగి చెల్లించలేదు. యువకులు సింగరేణి చరిత్ర తెలుసుకోవాలి. వందశాతం తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణిలోంచి సమైక్య రాష్ట్రంలో చేతగాని కాంగ్రెస్‌ పాలకులు అప్పులు తిరిగి చెల్లించకపోవడంవల్ల కేంద్రానికి 49 శాతం వాటా వెళ్లింది. లేకపోతే వందకు వందశాతం మన గనులు, మన ఆస్తి. ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైన గనిలో 49 శాతం వాటా కేంద్రానికి వదులుకోవాల్సి వచ్చింది’ అని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే సింగరేణి నడకను మార్చినం. మొదటి అడుగులోనే 3 శాతం తెలంగాణ స్టేట్‌ ఇంక్రిమెంట్‌ ఇచ్చినం. కంపెనీ టర్నోవర్‌ కాంగ్రెస్‌ రాజ్యంలో రూ.11 వేల కోట్లు ఉండేది. దాన్ని ఈ రోజు రూ.33 వేల కోట్లకు తీసుకుపోయినం. సింగరేణి లాభాలు రూ.419 కోట్లు ఉండేది. దాన్ని రూ.2,184 కోట్లకు తీసుకుపోయినం. గతంలో కార్మికులకు పంచే లాభం ఏటా 60, 70 కోట్లు ఉండేది. కానీ ఈ దసరాకు మనం పంచిన లాభం రూ.700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి యువ కార్మికులతో కళకళలాడుతున్నది’ అని సీఎం చెప్పారు.‘తెలంగాణ రాకముందు 6400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లలో 19,463 మంది ఉద్యోగాలిచ్చినం. డిపెండెంట్‌ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్‌ యూనియన్‌. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వచ్చినంకనే డిపెండెంట్‌ ఉద్యోగాలను పునరుద్ధరించాం. దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలిచ్చాం. గతంలో కార్మికులు చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్లు . ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తున్నం. డిపెండెంట్‌ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షలు ఇస్తున్నం. కార్మికులు తీసుకునే ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తున్నది. రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తున్నది. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 22 వేల మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగింది’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
గోదావరిని చూసి సంతోషపడేది తప్ప.. చుక్క నీరురాలే
గతంలో గోదావరిని చూసి సంతోషపడేది తప్ప.. చుక్కా నీరు రాకపోయేదని గుర్తు చేశారు. ‘తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితి విూకు తెలుసు. ఆ నాడు కరెంటు లేదు. కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో విపరీతమైన విపరీతమైన కరెంటు కోతలుండేవి. మంచినీళ్లు లేవు. కొత్తగూడెం పట్టణంలో ఆ నాడు నీళ్లు ఎట్ల వచ్చినయో.. ఇప్పుడు ఎట్ల వస్తున్నయో విూకు తెలుసు. సాగునీరు లేదు. వ్యవసాయం దండగైపోయింది. బతక వలసలుపోవాల్సిన పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. పేదల గతి ఘోరంగా ఉండేది. ముసలివారిని ఆదుకునే వారు లేరు’ అన్నారు.‘పెన్షన్‌ ఇస్తే రూ.40, రూ.70, రూ.200 ఇచ్చేవారు. ఆనాడు చెట్టుకొకరు గుట్టకొకరైన తెలంగాణను ఓ దరికి తేవాలని.. ఓ పాలసీ ప్రకారం మొదట కరెంటు బాధలు తీర్చుకున్నాం. మంచినీళ్ల బాధ లేదు. కరెంటు అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదు. యాదాద్రి పవర్‌ స్టేషన్‌ పూర్తయితే 4వేల విద్యుత్‌శ్చక్తి వస్తుంది. కొత్తగూడెం జిల్లానే సమైక్య రాష్ట్రం ఎవరూ చేయకపోదురు. స్వరాష్ట్రంలో జిల్లాకావడంతో పాటు మెడికల్‌ కాలేజీ వచ్చింది. ఏ చిన్న జబ్బు వచ్చినా ఖమ్మం, హైదరాబాద్‌కు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడే బ్రహ్మాండమైన ఆసుపత్రి వచ్చింది. 60`70 మంది వైద్యులున్నారు. అందరికీ మంచి వైద్యం అందుతున్నది. గతంలో కిడ్నీ బీమార్‌ ఉంటే.. డయాలసిస్‌ సెంటర్‌ లేదు. ఇప్పుడు కొత్తగూడెంలోనే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. పేషెంట్లకు సైతం పెన్షన్‌ ఇస్తున్నాం’ అంటూ గుర్తు చేశారు.
గిరిజనులకు భూములు పంచాం..
‘గిరిజనులకు పంచాల్సిన పొడు భూములను కొత్తగూడెం జిల్లాలో 16,769 ఎకరాల భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. 4,500 కుటుంబాలకు లబ్ధి జరిగింది. పట్టాలు ఇవ్వడంతో పాటు కేసులను ఎత్తివేయడంతో పాటు రైతుబంధు అమలు చేయడంతో పాటు బీమా ఇస్తున్నాం. 50 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో కాని పని. ఆ రోజు బోరు వేస్తే 800`600 ఫీట్లు వేసినా నీరు లేదు. కానీ ఈ రోజు భారతదేశంలో భూగర్భ జలాలు అడుగంటుతుంటే.. తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు పైకి వచ్చాయ్‌. ఇది మన లెక్క కాదు.. కేంద్రం లెక్క. 739 టీఎంసీల భూగర్భ జలాలు రీఛార్జి జరిగి భూమిలో ఉన్నాయి. రెండు నాగార్జున సాగర్లకు సమానమైన నీరు తెలంగాణ భూమిలో ఉన్నది. గతంలో గోదావరిని చూసి సంతోషపడేది తప్పా.. చారెడు నీళ్లు రాకపోయేది. భద్రాచలం వెళ్లినప్పుడుల్లా గోదావరికి దండం పెట్టడం.. రూపాయి నాణెం వేయడం తప్పా నీళ్లు రాలేదు’ అని తెలిపారు.‘ఈ రోజు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం. 70శాతం పూర్తయ్యింది. కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది. వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. అందులో డౌట్‌ లేదు. నేను వచ్చి ఆ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తా. గతంలో కరెంటు ఏ విధంగా ఉండేది. చిన్న హోటల్‌ నడిపితే.. గిరాకీ రూ.1000 అయితే.. కరెంటు బిల్లు మాత్రం రూ.1500 వచ్చేది. కొత్తగూడెంలో రోడ్లన్నీ బాగు చేసుకున్నాం. సెంట్రల్‌ లైటింగ్‌ను పెట్టుకున్నాం. అప్పటికీ ఇప్పటికీ రూపురేఖలు చాలా వరకు మారిపోయాయి. మూర్రేడువాగు పట్టణంలోని కొన్ని ప్రాంతాలను ముంచివేస్తున్నది. శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరారు. రూ.30`40కోట్లు మంజూరు చేశాం. పనులు పూర్తయితే ముంపు సమస్య నుంచి బయటపడుతాం. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం’ అన్నారు.