తూటాల వర్షంలో శాంతి చర్చలు కుదరవు: ప్రణబ్

om7qscm7న్యూఢిల్లీ: చర్చలతో విభేదాలు పరిష్కరించుకోవచ్చని, అయితే తూటాల వర్షంలో శాంతి చర్చలు సాధ్యం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం స్పష్టం చేశారు. సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కృతం కావాలంటే దేశాల మధ్య నిరంతర ప్రాతిపదికన చర్చలు జరగాలని ఉద్ఘాటించిన ఆయన ‘బులెట్ల వర్షంలో శాంతిని చర్చించలేం’అ ని తేల్చి చెప్పారు. విభేదాలను పరిష్కరించుకోవడానికి నాగరిక పద్ధతి ఉందని, చర్చలు నిరంతర కార్యక్రమంగా ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం ఎటువంటి సిద్ధాంతాలు లేని ఒక యుద్ధమని, అదొక క్యాన్సరని, దాన్ని పదునైన కత్తితో తొలగించాలని అన్నారు. పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ జరిపిన దాడి నేపథ్యంలో రాష్టప్రతి చేసిన ఈ వ్యాఖ్యలకు విస్తృత ప్రాధాన్యత చేకూరింది. ఉగ్రవాదంలో మంచి, చెడు అన్న తేడాలుండవని..ఇదో దుష్ట శక్తేనని తెలిపారు. 67వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడిన రాష్టప్రతి దేశీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాల్లోనూ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోయినా అందరికీ ముప్పు తెస్తున్న తీవ్రవాదం విషయంలో మాత్రం ఉమ్మడిగా ముందుకెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాద శక్తుల్ని ఉమ్మడి శక్తితో మట్టుబెట్టక పోతే అరాచక పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. విభేదాలున్నా నాగరిక మార్గాల్లో వాటిని నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని..అన్ని సమస్యల పరిష్కారానికి తిరుగులేని మంత్రం నిరంతర చర్చల ప్రక్రియేనని ఉద్ఘాటించారు. అసహన, హింసాత్మక, అహేతుక శక్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలన్నారు. భారత్‌లో మనలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే ఈ హక్కుకు.. ముఖ్యంగా నగరాల్లో భంగం వాటిల్లుతోందన్నారు. అక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయులకు చేరిందని, బహుళ వ్యూహాలు, వివిధ స్థాయుల్లో చర్యలు అవసరమని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, ప్రగతిశీలక శాసనాలు తేవాలంటే సయోధ్య స్ఫూర్తి, ఏకాభిప్రాయమే సరైన మార్గాలని రాష్టప్రతి ప్రణబ్ ఉద్ఘాటించారు. వస్తుసేవల బిల్లు (జిఎస్‌టి) విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగుతున్న వివాదం నేపథ్యంలో ప్రణబ్ ఈ బలమైన సందేశాన్నందించారు. విధాన నిర్ణయాల్లో ఏకాభిప్రాయ సాధనే ప్రాధాన్యతా మార్గం కావాలన్నారు. వృద్ధి వేగం పెరగాలంటే సంస్కరణలు, ప్రగతిశీల శాసనాలూ ఎంతో అవసరమన్నారు. సరైన రీతిలో సమగ్ర చర్చలు జరపడం ద్వారా ఇందుకు అన్ని విధాలుగా సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన గురుతర బాధ్యత చట్ట సభ సభ్యులపై ఉందన్నారు. విధాన నిర్ణయాల్లో జాప్యం జరిగినా, వాటి అమలులో తాత్సారం చోటుచేసుకున్నా అది అభివృద్ధి వేగానికే విఘాతంగా మారుతుందన్నారు.