తెదేపా అభ్యర్థిని ఓడించండి
చంద్రబాబుకు బుద్ధి చెప్పండి
మంత్రి హరీశ్
హైదరాబాద్, మే 23(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలని ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూన్ 2న చంద్రబాబు నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునివ్వడం ఎందుకోసం అని హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని, తెలంగాణ వచ్చి ఏడాది గడుస్తున్నా ఆయనలో ద్వేషం తగ్గలేదని విమర్శించారు. ఈ కారణంగానే విభజనపై తెలంగాణలో ఒకలా? ఏపీలో మరోలా ఊసరవెల్లిలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శనివారం నాడు సచివాలయంలో విూడియాతో మాట్లాడిన హరీష్ రావు చంద్రబాబు నిరసన దీక్షపై తెలంగాణ టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంబరాల్లో ఉంటే విూరెందుకు ప్లకార్డులు పట్టుకుంటారని నిలదీశారు. టిటిడిపి నేతలు పార్టీని వీడి రాష్ట్ర అవతరణ సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. బాబు వైఖరికి నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యతిరేకతపై చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదని, ఏడాదిలో ఏం చేశారో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.