తెలంగాణకు పెట్టుబడులతో రండి
అమెజాన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
మహబూబ్‌నగర్,జూన్10(ఆర్‌ఎన్‌ఎ): పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉండబోతోందన్నారు. దీనిని సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రకటిస్తారని చెప్పారు. కొత్తూరు మండలం పెంజర్లలో అమెజాన్ పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ నెల 12న రెండు వేల మంది పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారని తెలిపారు. స్కిల్డ్ వర్క్‌ఫోర్స్ మన దేశంలో ఉందన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యువతకు ప్రభుత్వమే శిక్షణ ఇస్తుందన్నారు. అవినీతి అంటు లేకుండా పరిశ్రమలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అమెజాన్ సంస్థకు కేవలం పది రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. అమెజాన్ తెలంగాణలో పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దీని వల్ల 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అమేజాన్‌ను కోరుతున్నామని తెలిపారు. అమెజాన్ వారు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నానని చెప్పారు.
అమెజాన్ క్లౌడ్ సెంటర్ కూడా హైదరాబాద్‌లో పెట్టాలని కోరామని పేర్కొన్నారు.