తెలంగాణకు 7 టీఎంసీల నీటివిడుదలకు హామీ

– కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యతో టీపీసీసీ బృందం భేటీ

బెంగళూరు,,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి): తెలంగాణ నీటి అవసరాల కోసం నారాయణ పూర్‌ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అంగీకరించారు. శుక్రవారం బెంగళూరులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ బృందం సీఎం సిద్ధ రామయ్యను కలిసింది. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నీటి అవసరాలను తీర్చాలని వినతి పత్రం సమర్పించారు. అయితే టీపీసీసీ చేసిన విజ్ఞప్తిపై సిద్ధ రామయ్య సానుకూలంగా స్పందించారు. నారాయణ పూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని హావిూ ఇచ్చినట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. అలాగే రాజోలిబండ మళ్లింపు పథకానికి సంబంధించి స్పిల్‌ వే పనులను వెంటనే చేపట్టాలని, వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సంపత్‌ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బెంగళూరులో సిద్ధ రామయ్యను కలిసిన వారిలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, డీకే అరుణ, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.