తెలంగాణను అడ్డుకున్న వారే పాదయాత్రలు చేస్తున్నారు


ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ దీక్షా దివస్‌’లో నేతల ఆరోపణ

హైదరాబాద్‌,నవంబర్‌29:డిసెంబర్‌ 9న వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న వారే ఇవాళ తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలను బొందపెట్టాలన్నారు. తెలంగాణను అడ్డుకున్న వారు ఇప్పుడు జై తెలంగాణ అంటూ బయలు దేరారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజకీయ నాయకత్వం నిబద్ధతతో నిలబడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమేనని అన్నారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన దీక్షాదివస్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టాన్న్రి అడ్డుకున్నవారే నేడు జై తెలంగాణ అంటున్నారన్నారు. ప్రస్తుతం 87 శాతం మంది ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని, ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని కోదండరాం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు బహుముఖాలుగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం దాదాపు 900 మంది బలిదానాలు చేసుకున్నారని అన్నారు. ఆనాడు వచ్చిన తెలంగాణను ఇప్పుడున్న సీమాంధ్ర నేతలు అడ్డుకోవడంలో ఒక్కటయ్యారన్నారు. చంద్రబాబుతో సహా వైకాపాగా మారిన జగన్‌ కూడా తెలంగాణను అడ్డుకున్న వారే అన్నారు. ఆనాడు విద్యార్థి, యువజనులతో పాటు ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం కెసిఆర్‌ చేపట్టిన దీక్షకు మదద్దతుగా తెలంగాణ పోరాటం చేశారని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-కోసం దీక్షలకు సిద్ధమేనా? అని కోదండరాం ప్రశ్నించారు. గులాంనబీ ఆజాద్‌, వాయలార్‌ రవి, మనీష్‌ తివారితో పూటకో మాట మాట్లాడిస్తూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ చావుకు తెగించి ఆమరణ దీక్షచేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణకుఅనుకూల ప్రకటన వచ్చేలా చేశాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ దీక్షతో తెలంగాణ సమాజం మొత్తం కదిలిందని ఇక తెలంగాణ సాధించేవరకు పోరాటాన్ని ఆపేదిలేదన్నారు.అంతకు ముందు ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో సీమాంధ్ర పాలకులు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఒక్కటై పోరాటాలు చేయాలన్నారు. ఆంధ్రాపర్టీలను తరమి కొట్టాలన్నారు. కెసిఆర్‌ దీక్ష చేసి తెలంగౄణ ప్రకటన తెప్పిస్తే అడ్డుకున్నదే ఈ సీమాంధ్ర పార్టీలన్నారు. వీరు చేసిన కుట్రల కారణంగానే వచ్చిన తెలంగౄణ పోయిందన్నారు. జెఎసి పిలుపు మేరకు మరో మానుకోటకు సిద్దంగా ఉన్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు హజరయ్యారు. పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఈ సభకు తరలివచ్చారుతెలంగాణ ఏర్పాటు కోరుతూ తెరాస అధినేత కేసీఆర్‌ నిరాహారదీక్ష చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం తెరాస శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ‘దీక్షా దివస్‌’ను నిర్వహిస్తున్నాయి.