తెలంగాణను చూసి నేర్చుకోవాలి: చెవిరెడ్డి

హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను చూసి ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు చాలా నేర్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎమ్మెల్యేల గ్రాంట్లు మింగేసి టీడీపీ మంత్రులు ఏం సాదిస్తారు?. మూడు బడ్జెట్లలో నియోజకవర్గాలకు నయా పైసా కేటాయించలేదు. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాలకు గ్రాంట్లు పెంచితే మేం ఇవ్వం అని మంత్రి యనమల సభలో అనడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్‌ ను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశిస్తుంటే.. ఇక్కడ ప్రభుత్వం, మంత్రులు ఎమ్మెల్యేలను అనగద్రొక్కాలని చూస్తున్నారు అని చెవిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యాడు.  నియోజక వర్గ శాసన సభ సభ్యులకు కెటాయించాల్సిన నిధులను స్పెషల్‌ డెవలప్మెంట్‌ ఫండ్‌ పేరుతో టీడీపీ కార్యకర్తలకు కెటాయించడం పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన.. నియోజక వర్గ ప్రజలకు సేవ చేయాలని ఉన్నా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో తమ చేతులు కట్టేస్తోందన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో నియోజక వర్గ శాసన సభ్యలకు నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించం అని ప్రభుత్వం మొండిగా చెబుతుండటం సిగ్గుచేటన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు నిధులు కెటాయించనప్పుడు తనకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం ఎందుకని ప్రసాద్‌ రెడ్డి ప్రశ్నించారు. నియోజక వర్గ శాసన సభ సభ్యులకు నిధులు కెటాయించకుండా అధికార పార్టీ నేతలు అగ్రగామి రాష్ట్రం పేరుతో నోటికొచ్చిన కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు.