తెలంగాణను తేల్చకుండా ప్రధాని పర్యటన శోచనీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని గత 60 సంవత్సరాలుగా నాన్చుతుందని పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలంగాణలో తిరగరాదని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణను తేల్చకుండా మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని వైఖరిని నిరసిస్తూ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా జీవ వైవిధ్య సదస్సుకు రావడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు చర్య తీసుకోవాలన్నారు. ప్రధాని పర్యాటనను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతిఘటించకపోవడం దారుణమన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టి జేఏసీ చైర్మన్‌ గోపాల్‌శర్మ, టిఆర్‌ఎస్‌ అర్బన్‌ ఇన్‌చార్జి పోశెట్టి, మురళి, టిఎన్‌జిఓస్‌ జిల్లా అధ్యక్షుడు గంగారం తదితరులు పాల్గొన్నారు.